మిల్లులు ఫుల్.. మిల్లర్లు పరేషాన్!

by Muthe.Rajitha |

సీఎంఆర్ కేంద్రం నుంచి స్పష్టత లేకపోవడంతో మిల్లర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

మిల్లులు ఫుల్.. మిల్లర్లు పరేషాన్!
X

దిశ, హుజూరాబాద్: సీఎంఆర్ కేంద్రం నుంచి స్పష్టత లేకపోవడంతో మిల్లర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘టార్గెట్’ ఇవ్వకపోతే మిల్లులు మూసివేస్తామని మిల్లర్లు అల్టిమేటం జారీ చేసే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే రెండు సీజన్లకు సంబంధించి ధాన్యం నిల్వలు మిల్లుల్లో పేరుకుపోగా, తాజాగా ఈ సీజన్ ధాన్యం కూడా వచ్చి చేరుతుండడంతో మిల్లులన్నీ ‘ఫుల్’ అయిపోయాయి. దీంతో ఇంకా ధాన్యాన్ని నిల్వ చేసే పరిస్థితి లేదని మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. అయినా వీరి గోసను అధికారులు పట్టించుకోవడం లేదు. బలవంతంగా ధాన్యాన్ని మిల్లుల్లో దించుతున్నారు. స్థలం లేక ఆరుబయటే ఆ ధాన్యాన్ని ఉంచాల్సి వస్తున్నదని మిల్లర్లు వాపోతున్నారు.

అలాట్ మెంట్ ఎప్పుడు?

రాష్ట్రంలో 54లక్షల టన్నుల ధాన్యం టార్గెట్ ఎప్పుడో పూర్తయ్యింది. 80 లక్షల టన్నుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రం కోరుతున్నా.. కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. ధాన్యం కొనుగోళ్లకు ఎఫ్ సీఐ నిధులు విడుదల చేస్తున్నా.. మిల్లింగ్ కు సంబంధించి మార్గదర్శకాలను ఇంతవరకు విడుదల చేయలేదు. దీంతో మిల్లింగ్ మొదలు పెట్టాలా? వద్దా? అనే సందిగ్ధంలో మిల్లర్లు కొట్టుమిట్టాడుతున్నారు.

పెనాల్టీ, తరుగుదల భయం

బియ్యం ఆరు బయట నిల్వ ఉంచుతుండడంతో తరుగుదుల భయం ఏర్పడుతున్నదని మిల్లర్లు వాపోతున్నారు. మిల్లింగ్ చేశాక బియ్యం లెక్కల్లో తేడా వస్తే అధికారులు ఎంఎస్పీతోపాటు 25 శాతం కలిపి పెనాల్టీ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన జీవో 27 ప్రకారం 10-25 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుండడంతో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని చెబుతున్నారు. సన్న ధాన్యానికి బోనస్ తో రైతులు సంతోషంగాఉన్నారని, అయితే మిల్లుల్లో జాగా లేకపోవడంతో నిల్వ కోసం ఇబ్బంది అవుతున్నదని పేర్కొంటున్నారు. తమ గోదాముల్లో నిల్వలున్నాయన్న సాకుతో కేంద్రం కొత్త అలాట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. బాయిల్డ్ రైస్ కు టార్గెట్ లేకపోవడంతో మొత్తం వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బ్యాంక్ గ్యారంటీ, తూకంలో తరుగుదల, నూక శాతం పెరుగుదల, మిల్లింగ్ అవకాశాలు కోల్పోవడం ద్వారా డిఫాల్టర్ల జాబితాలో చేరిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సీఎంఆర్ అలాట్ మెంట్ ఇప్పించాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామని మిల్లర్లు వాపోతున్నారు.

సంక్షోభంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమ -ఎ. సుధాకర్ రావు, తెలంగాణ రైస్ మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శి

రాష్ట్రంలో ప్రస్తుతం రైస్ మిల్లింగ్ పరిశ్రమ అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ప్రస్తుత పరిస్థితి వల్ల అటు రైతులు, ఇటు మిల్లర్లు నష్టపోతున్నారన్నారు. ఈ రబీ సీజన్‌లో ధాన్యం ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికే 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అందులో 20 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రానికి సరఫరా కూడా చేసినప్పటికీ, మిగతా ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు కావాల్సిన టార్గెట్లు, కోటాలపై స్పష్టత లేదు. దీంతో వేల సంఖ్యలో ఉన్న రైస్ మిల్లులు నిలిచిపోయే పరిస్థితి ఉన్నది. మిల్లింగ్ టార్గెట్లు లేకపోవడంతో ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిస్థితి కొనసాగితే, ఇప్పటివరకు సక్రమంగా పనిచేసిన మంచి మిల్లులు కూడా డీఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వాలు వెంటనే పరిష్కారం చూపాలి.

Next Story