- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిలర్ల ఇష్టారాజ్యం.. బస్తాకు 5 కేజీల తరుగు తీస్తేనే సీఎంఆర్‌కు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు తీసి తూకం వేసిన వాటిని సీఎంఆర్‌కు తరలిస్తామని మిల్లర్లు హెచ్చరిసున్నట్టు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు తీసి తూకం వేసిన వాటిని సీఎంఆర్‌కు తరలిస్తామని మిల్లర్లు హెచ్చరిసున్నట్టు తెలిసింది. ఎండిన ధాన్యం పెద్ద మొత్తంలో కేంద్రాలకు రావడంతో సెంటర్ల ఇబ్బందికి రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు లేకుండా ఉన్నదానిని మాత్రమే కాంటాకు వేయాలని సూచనలు చేసినట్టు సమాచారం. నేరుగా తూకం వేస్తే బస్తాకు 5 నుంచి 6 కిలోల తరుగు కింద కోత పెట్టాలని లేకుంటే ధాన్యం తీసుకెళ్లమని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రైతుల నుంచి ధాన్యం సేకరణ సమయంలో ఎలాంటి తరుగు తీయొద్దని మంత్రులు, కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు చెప్పినా మిల్లర్లు లెక్క చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వేళ తూకం వేసిన తాము మిల్లుల వద్ద ధాన్యం దించే ముందు తరుగు చేసి పరిగణనలోకి తీసుకుంటామని బాహాటంగా చెబుతున్నారు. తాము క్వింటాల్ ధాన్యం తీసుకెళ్లితే 67 కిలోల బియ్యాన్ని లెవిగా ఇవ్వాల్సి ఉంటుందని, ఈ సీజన్‌లో పండిన ధాన్యాన్ని సీఎంఆర్ చేస్తే 60 కిలోలు మాత్రం బియ్యం వస్తున్నాయని చెబుతున్నారు. ఎక్కువ వేడి కారణంగా బియ్యం నూకగా మారడంతో తాము నష్టపోతున్నామని, ధాన్యం తరుగు తీస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. తేమ శాతం విషయంలో కూడా కొర్రీలు పెడుతున్నట్టు కొనుగోలు కేంద్రాలు నిర్వహకులు చెప్పారు.
7.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ప్రభుత్వం ఈ సీజన్‌లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు 7.60 లక్షల ధాన్యం సేకరించగా అందులో 5.10 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 2.50 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,500 కొనుగోలు కేంద్రాలకు అందుబాటులోకి తీసుకురాగా, వాటిని జూన్30 వరకు రైతులు ధాన్యం అమ్మకాలు చేసేలా ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో తరుగు పేరిట కోతలు లేకుండా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నా, తరుగు తీస్తేనే కాంటాలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన సమయంలో లారీలు అందుబాటులో ఉండటం లేదు.
ధాన్యం సేకరణకు గన్నీ బ్యాగుల కొరత
ఇప్పటికి కొన్ని కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత ఉంది. బస్తాలు లేకపోవడంతో తూకం వేయడం ఆలస్యంగా జరుగుతోంది. అసలే అకాల వర్షాలు రైతులను భయపెట్టిస్తుంటే గన్నీ సంచుల అందుబాటులో లేకపోవడం మరింత టెన్షన్ గురవుతున్నారు. ఒకవేళ ధాన్యం తడిసిపోతే ఐదారు రోజుల ఎండబెట్టి తూకం వేయాల్సి వస్తోందని, దీంతో ధాన్యం బరువు తగ్గుతుందంటున్నారు. ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి, గద్వాల, వనపర్తి జిల్లాలో జిల్లా పౌరసరఫరాల అధికారులు బస్తాలు కావాలని ఉన్నతాధికారులకు తెలిపారు. కొన్ని గ్రామాల్లో గన్నీ బస్తాల కొరతతో కొనుగోలు ప్రారంభించకపోవడంతో కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులు ఇబ్బంది పడుతున్నారు.
రైతుల హెచ్చరికలు
కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు చెప్పినట్టు తరుగు పేరుతో బస్తాకు 5 కిలోల కోత పెడితే ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం తరలించబోమని రైతులు హెచ్చరిస్తున్నారు. ట్రాక్టర్లు, డీసీఎం ద్వారా ధాన్యం తీసుకొస్తే గుట్టుగా వే బిడ్ర్జి వద్దనే కోత పడుతుందని, మళ్లీ కేంద్రాల్లో తరుగు తీస్తే తమకు మిగిలేది ఏమిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






