- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల ‘తరుగు’ దందా: నాణ్యత సాకుతో క్వింటాల్‌కు 3 కిలోల కోత!
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే నిర్వహకులు, మిల్లర్లు దోపిడీ దందాకు తెర లేపారు. ధాన్యం నాణ్యత లేదని, రంగు మారిందని సాకులు చూపిస్తూ క్వింటాల్‌కు 3 కిలోల వరకు కోత పెడుతున్నారు. ఒకబస్తా 41 కిలోల వరకు తూకం వేయాలని ఉంటే నిర్వహకులు 44 కిలోలకు పైగా తూకం వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రైతులు ప్రశ్నిస్తే కేంద్రాల్లో తూకం వేసి మిల్లులకు చేరిన తరువాత ఆన్లోడింగ్చేయకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. తేమ శాతం, తాలు, రాళ్లు ఉన్నాయని ఈ ధాన్యం తీసుకుంటే నష్టపోతామని సాకులు చెబుతూ ధాన్యం వెనక్కి తీసుకుపోవాలని అన్నదాతలకు బెదిరింపులకు గురిచేస్తున్నట్టు టాక్వినిపిస్తోంది. దళారులు జోక్యం చేసుకుని క్వింటాల్‌కు తాము సూచించిన విధంగా కోత పెట్టేందుకు ఒప్పకుంటేనే మిల్లులోకి దించే విధంగా చూస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. లారీలో ధాన్యం ఉంచలేక, ఆకాల వర్షం వస్తే తడిసిపోతుందని తప్పని పరిస్థితిలో క్వింటాల్‌కు రెండు నుంచి మూడు కిలోల కోత పెట్టిన ఒప్పుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఒక లారీలో 600 వరకు బస్తాలు తరలిస్తే కోతలతో మిల్లర్లు, కేంద్రాల నిర్వహకులకు సుమారుగా రూ. 25 వేల వరకు సంపాదించుకున్నట్టు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పంట పండించిన రైతు కంటే రైస్‌మిల్లర్ల దందా బాగుందని, ఎలాంటి కష్టం లేకుండా లక్షల సంపాదిస్తున్నారని, రైతులను అధికారుల కన్నుసన్నలో మిల్లర్లు మోసగిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైతుకు అన్నీ కష్టాలే..
సాగు మొదలైనప్పటి నుంచి పంట తీసి మార్కెట్లో అమ్మే వరకు రైతుకు అన్ని కష్టాలే. పంటలు కోతకు వచ్చని సమయంలో వరి కోత మిషన్ల యాజమానులు దోపిడీ చేస్తూ రోజు రోజుకు ధరలు పెంచుతూ రైతుకో విధంగా నగదు తీసుకుంటారు. తర్వాత కల్లాల నుంచి ధాన్యం తీసుకొచ్చేందుకు ట్రాలీలు, డీసీఎంలు ధరలు పెంచుతారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే నిర్వహకులు అక్కడ ధాన్యం రాశులుగా పొసేందుకు స్థలం లేదని ఇబ్బందులు పెడుతున్నారు. తూకం వేసిన తాలు, పచ్చిగా ఉందని తరుగు కోతలు, లారీ లోడ్‌చేసిన దించే ముందు మరో రకమైన వేధింపులు ఉంటున్నాయి. ఇన్ని కష్టాల మధ్య రైతులు పంట పండించే పరిస్థితి దేశంలో ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఈవోలదే బాధ్యత
యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు బాధ్యతలు ఏఈవోలకు అప్పగించారు. గతంలో ఒక సెంటర్‌కు ఒక అధికారి బాద్యతలు ఇవ్వగా ప్రస్తుతం ఒక ఏఈవోకు నాలుగైదు సెంటర్లు కేటాయించారు. దీంతో వారు విధులు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఐదారుగురు చేయాల్సిన పని ఒకరిపై మోపారు. అయిన వారికి ఎలాంటి పారితోషికం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కోసం విడుదల చేస్తున్న జీవోలలో వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టవలసిన 5 రకాల విధులను స్పష్టంగా పొందు పరుస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం కొన్ని జిల్లాల్లో యంత్రాంగం మాత్రం అందరిది ఒక దారి ఐతే తమది ఇంకో దారి అన్న చందంగా ఉంది. జీవోలో సూచించిన ఐదు రకాల పనులతో సంబంధం లేకుండా ఏఈఓ లతో ట్రక్ షీట్ లు సర్టిఫై చేయడం, రైతులు తీసుకొచ్చే ప్రతీ లాట్ కు క్వాలిటీ సర్టిఫికెట్లు ఇవ్వడం, గన్నీల భద్రత, లెక్కలు చూసుకోవడం వంటి పనులను వ్యవసాయ శాఖ అధికారులతో చేయించడం ఎంత వరకు సమంజసమని వ్యవసాయ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కొనుగోళ్లు వేగవంతం
రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని సాగు ఆలస్యమైనందున మరో 13 జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదన్నారు. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఈ సీజన్ లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటి వరకు 5 వేల కేంద్రాలు అందుబాటులోకి తెచ్చి 4.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వకు 12 లక్షల మెట్రిక్ టన్నులు నిలువ చేసేలా గోదాములు గుర్తించామని, మరో 20 లక్షల బాయిల్డ్ రైస్ ను నిలువ ఉంచేందుకు జిల్లాల వారీగా కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో 16 కోట్ల గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ధాన్యం తేమను త్వరితగతిన కొలిచేందుకు వీలుగా ప్యాడి క్లినర్లు, డ్రైయర్లు ఏర్పాటు చేసినట్లు, ఆలస్యం జరగకుండా చూసేందుకు సరిపడా హమాలిలను నియమించినట్లు చెప్పారు. తూకంలో పొరపాట్లు జరగకుండా ధాన్యాన్ని ఆయా ప్రాంతంలో ఉన్న మిల్లులకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యాం తరలి రాకుండా ఉండేలా అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టినట్లు తెలిపారు. రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేలా పౌర సరఫరాలశాఖా మార్కెటింగ్ శాఖలతో పాటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.






