- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో పడిపోయిన పాల ఉత్పత్తి.. పట్టించుకోని పశుసంవర్ధక శాఖ
తెలంగాణలో పాల కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాల కొరత ముంచుకొస్తుంది. రోజు రోజుకు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పాల ఉత్పత్తికి ప్రోత్సహకాలు కల్పించి, ఉత్పత్తి పెంచాల్సిన పశుసంవర్ధక శాఖ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. పశువులకు సంబంధించిన పాత లెక్కలే చూపిస్తూ పశు సంపదలో టాప్ఉన్నామనేది ఉత్త మాటలేనని పాల ఉత్పత్తి దారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ఆశించిన విధంగా పాడి ఉత్పత్తి జరగకపోవడంతో పక్క రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి చేసుకునే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం పశుసంపద కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయింపు చేసిన వాటిని ఖర్చు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఈ రంగం రోజురోజుకు క్షీణించి పోవడం వల్ల భవిష్యత్తులో డబ్బాపాలే దిక్కు అవుతాయనే భయాందోళన ప్రజల్లో నెలకొంది.
ప్రస్తుతం తెలంగాణలో రోజుకు సుమారు 26 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో కేవలం 4 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇది రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు సరిపడే స్థాయిలో లేదు. పాడిపశువుల సంఖ్య తగ్గడంతో పాల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం ప్రభుత్వం డైరీలకు పాలు రోజుకు 50 వేల లీటర్లు తగ్గిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత పెరగనుంది. ఇందుకు కారణం తెలంగాణలో పశుసంపద వృద్ధి చెందకపోవడమే. గేదెలు, ఆవుల సంఖ్య తగ్గడంతో పాడి, దాని అనుబంధ ఉత్పత్తులు తగ్గాయి. గతేడాది పశుసంవర్ధక శాఖ వెల్లడించిన గణాంకాలు చూస్తే పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గింది.
35 శాతం తగ్గుదల..
రాష్ట్రంలో 25.82 లక్షల కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవనో పాధి పొందుతున్నాయి. ఇందులో 12 లక్షల కుటుంబాలు అవుల పెంపకం, 10.5 కుటుంబాలు గేదెల పెంపకం చేస్తున్నాయి. తెలంగాణలో 42.32 లక్షల అవు జాతి పశువులు, 42.26 లక్షల గేదెలు, 49.35 లక్షల మేకలు ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ గణాంకాలు చెబుతున్నా క్షేత్రస్దాయిలో మాత్రం అవుల సంఖ్య 29. 15 లక్షలు, గేదెల సంఖ్య 30.52 లక్షలు, మేకల సంఖ్య 41.50 లక్షలు ఉన్నట్టు సమాచారం. ఆశాఖ అధికారులు ఇప్పటివరకు చూపిస్తున్న లెక్కలు 2019 సంవత్సరానికి సంబంధించినవేనని తెలుస్తోంది. గతంలో ఉన్నవాటికి కంటే 35 శాతం తగ్గినట్టు, ఇప్పటికి పాత గణాంకాలు చూపిస్తున్నట్టు ఆశాఖకు చెందిన కిందిస్థాయి సిబ్బంది చెప్పారు. సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో 45 శాతం అవుల సంఖ్య తగ్గింది. సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డిలో గేదెల సంఖ్య భారీగా పడిపోయింది.
ప్రోత్సాహం కరువు..
పాడి పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే రైతులు ఈ రంగం నుంచి దూరవుతున్నారు. రైతులకు ఆశించిన స్థాయిలో మద్దతు లేకపోవడం, పశువైద్య సేవలు సమర్థవంతంగా లభించడం లేదు. గోపాల మిత్ర వంటి సిబ్బంది ఉన్నప్పటికీ వారికి సకాలంలో వేతనాలు అందడం లేదు. ప్రతి ఏటా వారు జీతాల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులు చుట్టు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. మరో వైపు పశువుల దాణా, మేత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పచ్చిగడి, పశువులకు సేవలందించేందుకు కూలీల దొరకడం లేదు. గ్రామాల్లో పశువైద్య సేవలు సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో, రైతులు నష్టపోతున్నారు. గ్రామీణ రైతు కుటుంబాల్లో కేవలం 0.85 శాతమే పాడి పశువుల పెంపకంతో ఉపాధిని పొందుతున్నారని తెలిసింది. గతంలో ఉన్న రైతులు తప్ప పాడిపరిశ్రమ వైపు యువత మొగ్గు చూపడం లేదు.
ప్రైవేటు డైరీల హవా..
తెలంగాణ డైరీ రంగంలో అమూల్, మదర్ డైరీలతో పాటు దొడ్ల, హెరిటేజ్, కరీంనగర్ డెయిరీ వంటి ప్రయివేట్ సహకార సంస్థలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలను సేకరించి, అత్యాధునిక పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. వీటితో పాటు మిగతా చిన్న, మధ్య తరహా డైరీలు హైదరాబాద్, ఇతర జిల్లాలలో మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ప్రయివేట్ డైరీలు నేరుగా గ్రామీణ ప్రాంతాల రైతులతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని, పాల శీతలీకరణ కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పట్టణీకరణ కారణంగా ప్యాకేజ్డ్ పాలకు, ఇతర పాల ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరిగింది.






