- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి రేసింగ్ బైకులు, కార్లతో హల్‌చల్
నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్‌లో పగలు ప్రశాంతంగా కనిపించే రోడ్లు, రాత్రి కాగానే కొందరు పోకిరీల పాలిట రేసింగ్ ట్రాక్‌లుగా మారుతున్నాయి.

అర్ధరాత్రి రేసింగ్ బైకులు, కార్లతో హల్‌చల్
వీకెండ్‌లో ఐటీ కారిడార్, ఓఆర్ఆర్‌పై బీభత్సం
అడ్డుకోబోయిన పోలీసులపైకి వాహనాలు
దిశ, తెలంగాణ బ్యూరో/గండిపేట/ శేరిలింగంపల్లి: నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్‌లో పగలు ప్రశాంతంగా కనిపించే రోడ్లు, రాత్రి కాగానే కొందరు పోకిరీల పాలిట రేసింగ్ ట్రాక్‌లుగా మారుతున్నాయి. ఐటీ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైకులతో కొందరు యువకులు నిర్వహిస్తున్న రేసింగ్‌లు నగరవాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
సైలెన్సర్లను పీకేసి
సాధారణ రోజులతో పోలిస్తే వీకెండ్స్‌లో రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్లను ఈ రేసర్లు అడ్డాగా మార్చుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత టెకీలు ఎక్కువగా రాకపోకలు సాగించే మార్గాల్లో, విశాలమైన రోడ్లపై వీరు పందాలకు దిగుతున్నారు. వాహనాలకు ఉన్న ఒరిజినల్ సైలెన్సర్లను పీకేసి, భారీ శబ్ధాలు వచ్చేలా మోడిఫైడ్ సైలెన్సర్లను అమరుస్తున్నారు. సైలెన్సర్ల సౌండ్‌లతో, టైర్ల రాపిడితో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
పోలీసులకే రక్షణ కరువు
ఈ రేసర్ల ఆగడాలు కేవలం సామాన్యులను భయపెట్టడానికే పరిమితం కాలేదు. డబ్బు, పలుకుబడి మత్తులో చట్టం అంటేనే వీరికి ఏమాత్రం భయం లేకుండా.. తమ రేసింగ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపైనే వారు ప్రతాపం చూపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను ఆపేందుకు యత్నించిన కానిస్టేబుళ్లు, ట్రాఫిక్ పోలీసు సిబ్బందిపైకి ఏమాత్రం వెనుకాడకుండా కార్లను దూకించి ప్రాణాలు తీసేందుకు సైతం బరితెగిస్తున్నారు. పోలీసుల ప్రాణాలకే రక్షణ కరవైన ఇలాంటి ఘటనలు నగరంలో కలకలం రేపుతున్నాయి.
కానిస్టేబుల్‌కు గాయాలు
రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని టీ-హబ్ వద్ద బైక్‌లు, కార్లతో పోకిరీలు హల్‌చల్ సృష్టించారు. పోలీసులు కారు ఆపే ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్ చేతి వేళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మిగతా ముగ్గురు పరారయ్యారు. వారి ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేస్తామని ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. వాహనదారులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేసారు.
200 కిలోమీటర్ల వేగం
ఔటర్ రింగ్ రోడ్‌పై 10వ తేదీ ఉదయం వోక్స్‌వ్యాగన్ విర్టస్ కారు (తాత్కాలిక నెంబర్ టీజీటీఆర్ 2026)తో నార్సింగి టోల్ ప్లాజా నుంచి పోలీసు అకాడమీ టోల్ ప్లాజా వైపు ఓ వ్యక్తి గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో నిర్లక్ష్యంగా నడిపాడు. ర్యాష్ డ్రైవింగ్‌ను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. రోడ్ పెట్రోలింగ్ ఆఫీసర్ కారింగుల సాయిరాం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితు డు కొత్తపల్లి యశ్వంత్ రెడ్డిని అరెస్టు చేశారు.
నిరంతర నిఘా
నగర రోడ్లు సామాన్యుల ప్రయాణానికే తప్ప, రేసింగ్‌లకు కాదు. రాత్రి వేళల్లో ఐటీ కారిడార్, ఓఆర్‌ఆర్ మార్గాల్లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, స్పెషల్ డ్రైవ్‌లు చేస్తున్నాం. ఎక్కడైతే రేసింగ్‌లకు అవకాశాలు ఉన్నాయో అక్కడ అదనపు సిబ్బందిని మోహరించి స్పీడ్ గన్స్, సీసీ కెమెరాల ద్వారా రేసర్లను గుర్తిస్తున్నారు. ప్రశాంతంగా, భయం లేకుండా ప్రయాణించేలా నిరంతర నిఘా కొనసాగిస్తాం.
- రాహుల్ హెగ్డే, ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్






