తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

రాగల మూడు రోజులు రాష్ర్టంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాగల మూడు రోజులు రాష్ర్టంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గాలివేగం గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు సూచించింది. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తవరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శుక్రవారం నల్గొండ జిల్లా షాలి గౌరారంలో 9.3 సెం.మీ, సూర్యాపేట జిల్లా తిరుమల గిరిలో 7, జనగాం జిల్లా దేవరుప్పలలో 6.8, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరులో 6.7, మంచిర్యాల జిల్లా కొండాపూర్ లో 6.6 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 6.2, సూర్యాపేట్ జిల్లా చివ్వెంల 5.7 సెం.మీ, నల్గొండ మామిడాల లో 5.4 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 5.1 సెం.మీ, వనపర్తి జిల్ల వీపన్ గండ్ల లో 5 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గార్లలో 4 సెం.మీ, ఖమ్మం జిల్లా ఎంకూరులో 3 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం:

రాష్ట్రంలో పగటి పూట శీతల వాతావరణం కనిపిస్తుండగా, రాత్రి పూట ఉక్కపోతగా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పగటి పూట చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి 4.8 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతున్నాయి. శుక్రవారం మహబూబ్ నగర్ లో పగటి పూట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4.8 డిగ్రీలు తగ్గి 27 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నల్గొండలో 3.9, హైదరాబాద్ లో 3.7, హన్మకొండలో 3.2 డిగ్రీల వరకు పడిపోయాయి. అదే సమయంలో రాత్రిపూట మాత్రం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. శుక్రవారం దుండిగల్ లో సాధారణం కన్నా 41 డిగ్రీలు అధికంగా 23.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పటాన్ చెరులో 3.7, ఆదిలాబాద్ లో 3.7, రామగుండం, హయత్ నగర్ లలో 3.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. దీంతో రాత్రిపూట ఉక్కపోతగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు తిరోగమనం నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

Next Story