- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్సీ పర్యటన ప్రైవేటు కార్యక్రమం.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్
మెస్సీ పర్యటన ప్రైవేటు కార్యక్రమం.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మెస్సీ పర్యటనను ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నదని, ప్రభుత్వం కేవలం అవసరమైన సహకారం మాత్రమే అందిస్తున్నదని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు నగరానికి వస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి తాను కూడా ఒక అతిథిగా మాత్రమే హాజరవుతున్నానని చెప్పారు. ఈ ఈవెంట్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఢిల్లీలో కలిసిన ప్రముఖులను సైతం రావాలని కోరినట్లు తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని.. సమ్మిట్ ఫలితాలు తెలంగాణకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. తెలంగాణ విజన్ ఏంటి అనేది ప్రపంచానికి సమ్మిట్ ద్వారా తెలియజేశామని.. సమ్మిట్ విజయవంతంపై సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు వివరించానని తెలిపారు. తెలంగాణలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతతో పనిచేస్తున్నామని.. సంప్రదాయ విద్య కాకుండా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అందుకోసమే స్కిల్ యూనివర్సిటీని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను స్థాపిస్తున్నట్లు తెలిపారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని.. అన్ని యూనివర్సిటీలపైనా ప్రత్యేక దృష్టి పెట్టి పని చేస్తానని స్పష్టం చేశారు.






