Chiranjeevi: ఇటీవలే రేవంత్ రెడ్డితో భేటీ.. రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-08-06 06:56:00  IST  )

రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi: ఇటీవలే రేవంత్ రెడ్డితో భేటీ.. రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తానురాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి (Megastar Chiranjeevi) స్పష్టం చేశారు. పాలిటిక్స్ కు తాను దూరంగా ఉన్నా కొంత మంది నేతలు నన్ను విమర్శిస్తూనే ఉంటారని, సోషల్ మీడియాలో నాపై అవాకులు చవాకులు పేలుస్తుంటారని అన్నారు. రాజకీయ విమర్శలపై నేను పెద్దగా స్పందించనని సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలు అన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ అడ్డుకుని ఎదురుతిరిగింది. ఆ వీడియోను నేను చూశాను. గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని అందువల్లే నేనంటే ఆ మహిళకు గౌరవమని తెలిసిందన్నారు. నాపై చెడు రాతలు రాసేవారికి, మాట్లాడేవారికి నేను చేసే మంచే సమాధానం అని చిరంజీవి అన్నారు. మంచి చేస్తూ.. మంచి చేసే తమ్ముళ్లకు సహకరించడమే నాకు తెలుసన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై నేను స్పందించనని నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు అన్నారు. ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.

జూబ్లీహిల్స్ బరిలో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో..

కాగా రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో (Jubilee Hills By Poll) చిరంజీవిని బరిలోకి దింపేందుకు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే వీరిద్దరు భేటీ అయ్యారనే ప్రచారం గుప్పుమంది. గతంలో చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి ఇప్పటికీ సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మెగాస్టార్ ను బరిలోకి దింపాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉందనే చర్చ జోరుగా వినిపించింది. కానీ తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి తాజాగా వెల్లడించడం ఆసక్తిగా మారింది.

Next Story