TGEAPCET టాపర్‌కు మెగా సర్‌ప్రైజ్.. ఎం. రుషి కలను నిజం చేసిన చిరంజీవి

by Ramesh Naini |

తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషికి టాలీవుడ్ మెగాస్టార్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

TGEAPCET టాపర్‌కు మెగా సర్‌ప్రైజ్.. ఎం. రుషి కలను నిజం చేసిన చిరంజీవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషికి టాలీవుడ్ మెగాస్టార్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన అద్భుతమైన ప్రతిభతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన రుషిని, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు.

తండ్రి ఇచ్చిన మాట.. నిజం చేసిన మెగాస్టార్

పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ‘ఈఏపీసెట్‌లో స్టేట్ టాప్ ర్యాంక్ వస్తే మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడిస్తా’ అని రుషి తండ్రి ఆమెకు గతంలో మాట ఇచ్చారు. ఆమె అహర్నిశలు శ్రమించి టాపర్‌గా నిలవడంతో, తండ్రి తన కూతురికి ఇచ్చిన ప్రామిస్‌ను నెరవేర్చారు. ఈ అద్భుత విజయానికి ముగ్ధుడైన చిరంజీవి, ఆ యంగ్ అచీవర్‌ను స్వయంగా తన ఇంటికి పిలిపించుకున్నారు.

శాలువాతో సత్కారం.. ల్యాప్‌టాప్ బహుమతి

తన నివాసంలో రుషిని ఆత్మీయంగా పలకరించిన చిరంజీవి ఆమె విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రుషిని శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఉన్నత చదువుల నిమిత్తం ప్రోత్సాహకంగా ఆమెకు ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కష్టపడి చదివి టాపర్‌గా నిలవడమే కాకుండా, తన అభిమాన హీరోను స్వయంగా కలుసుకుని సత్కారం అందుకోవడంతో రుషి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కల నెరవేరినందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, ఈఏపీసెట్ టాపర్ రుషిని సత్కరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థులను ప్రోత్సహించడంలో చిరంజీవి చూపించిన చొరవపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story