HCU lands: 'సుద్దపూస మాటలే వద్దు..' హెచ్ సీయూ భూములపై కేటీఆర్ కు రఘునందన్ రావు కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-04-09 10:33:18  IST  )

హెచ్ సీయూ భూముల అమ్మకంలో భారీ స్కామ్ జరిగిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలకు రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.

HCU lands: సుద్దపూస మాటలే వద్దు.. హెచ్ సీయూ భూములపై కేటీఆర్ కు రఘునందన్ రావు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్ సీయూ భూములు (HCU Lands) తామే కాపాడినట్లు బీఆర్ఎస్ నేతలు సుద్దపూసలు మాట్లాడుతున్నారని కానీ అసలు తప్పు వాళ్లే చేశారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. ఇవాళ హెచ్ సీయూ భూముల విషయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు (Telangana BJP MPs) సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ తో పాటు హెచ్ సీయూ వీసీ జగదీశ్వర్ రావు హాజరయ్యారు. హెచ్ సీయూ భూములకు సంబంధించిన లీగల్ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు సెంట్రల్ యూనివర్సిటీతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 534 ఎకరాలు తీసుకుంటూ అగ్రిమెంట్ చేసుకుందని దాంట్లో 397 ఎకరాలు మాత్రమే తిరిగి యూనివర్సిటీ పేరుమీదకు బదలాయించిందని మిగతా 137 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. అయితే యూనివర్సిటీకి ఇవ్వాల్సిన 134 ఎకరాలను కేసీఆర్ (KCR) టీఎన్టీవోలకు ఇచ్చారని అన్నారు. నిజంగా బీఆర్ఎస్ కు విద్యార్థులపై, యూనివర్సిటీపై ప్రేమ ఉంటే ఆరోజే ఆ 134 ఎకరాలను యూనివర్సిటీకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇప్పుడు ఆ తప్పును ఇతరుల మీదకు నెట్టే ప్రయత్నాలను బీఆర్ఎస్ చేస్తోందని మండిప్డారు. టీఎన్జీవోలకోసం భూమి ఇచ్చి ఇక్కడ రోడ్డు వేస్తే దానిపై యూనివర్సిటీ కోర్టుకు వెళ్తే కేసు ఓడిపోయారు. దీనిపై సుప్రీకోర్టులో కోట్లాడుతున్నారు.

రేవంత్ రెడ్డి ఆ పని చేయాలి:

రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన నిజంగా ఇందిరమ్మ రాజ్యమే అయితే, ఆయన నోటి వెంట వచ్చేవి సత్యాలే అయితే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హెచ్ సీయూకు ఇచ్చిన 2,324 ఎకరాల భూమికి పెన్సింగ్ వేసి విద్యార్థులను కాపాడాలన్నారు. కేసులు ఎత్తివేశామని పైపైన నటించే కార్యక్రమాలు మానుకోవాలన్నారు. హెచ్ సీయూకు 2,185 ఎకరాల భూమి మాత్రమే ఉందని మిగతా 400 ఎకరాలు కూడా హెచ్ సీయూకు చెందినదే అని అయితే అది కోర్టు పరిధిలో ఉందని 2012లో నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాశారన్నారు. ఇవాళ కోర్టు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులది కాదని కోర్టు తేల్చింది. అలాంటప్పుడు ఆ భూమి హెచ్ సీయూకు చెందిన భూమి అవుతుంది కదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. 2012లో కలెక్టర్ రాసినట్లుగా హెచ్ సీయూ భూములు ఏవో వాటిని యూనివర్సిటీకి ఇచ్చేస్తే ఈ పంచాయితే లేదన్నారు. ఈ భూముల వెనుక కేటీఆర్ (KTR) చెబుతున్న స్కామ్ వివరాలు బయటపెట్టనివ్వండి అప్పుడు మాట్లాడుదామన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు దేశం దాటి పారిపోవడం లేదన్నారు. హెచ్ సీయూ విద్యార్థులకు అండగా ఉంటామని ఇక్కడ చర్చించిన విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

Next Story