సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో డీసీసీల వివాదం.. మీనాక్షి రాకతో ఎండ్ కార్డు పడేనా?

by Prasad Jukanti |   (  Updated:2025-12-01 07:09:28  IST  )

రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఎన్నికలు జరుగుతున్న వేళ డీసీసీల వివాదం కాంగ్రెస్ పార్టీలో కొత్త గందరగోళానికి దారి తీస్తోంది.

సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో డీసీసీల వివాదం.. మీనాక్షి రాకతో ఎండ్ కార్డు పడేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల నియామకం చిచ్చురేపుతోంది. అధిష్టానం తమ సిఫార్సులను పట్టించుకోలేదని కొన్ని చోట్ల, పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న తమకు సామాజిక న్యాయం పేరుతో అవకాశం దూరం చేశారని మరికొన్ని చోట్ల నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు క్షేత్ర స్థాయిలో సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం, ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో డీసీసీల విషయంలో నేతల మధ్య కినుకు రాజకీయం అధికార పార్టీలో చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి రాబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివాదాలకు చెక్ పెట్టేనా?:

డీసీసీల వివాదం అధికార పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తూ గత నెల 22న ఒకేసారి 36 మంది డీసీసీలను ప్రకటించింది. ఏఐసీసీ నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను పరిశీలకులుగా వచ్చి వారి సమక్షంలోనే బహిరంగ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. నేతల పనితీరు, కూర్పులో సామాజిక సమీకరణాల కోణాలను మేళవించి ఈ నియామకాలు చేపట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఈ నియామకాలు స్థానిక నేతల్లో అగ్గి రాజేస్తోంది. మహబూబ్‌నగర్‌ డీసీసీ పదవి విషయంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ధీమాతో ఉన్నప్పటికీ ఆయనకు బదులు అక్కడ సంజీవ్ ముదిరాజ్ ను నియమించడం వివాదం అవుతోందనే ప్రచారం ఉంది. వనపర్తి డీసీసీగా శివసేనారెడ్డి నియామకం పట్ల ఎమ్మెల్యే మేగారెడ్డి, చిన్నారెడ్డిలు అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి వరంగల్‍లో డీసీసీల నియామకం పార్టీలో చిచ్చు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మాత్రం మంత్రుల అనుచరులకు దక్కాయని మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే భార్యకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. వరంగల్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అనూహ్య పరిణామాలే జరిగాయానే చర్చ జరుగుతోంది. ఇక్కడ మైనార్టీ నేత ఆయూబ్‌ను పదవి వరించింది. నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుడిగా కాటిపల్లి నగేశ్‌రెడ్డి ఎంపికపై నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని, కామారెడ్డి డీసీసీగా ఇప్పటివరకు వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న కైలాస్‌ శ్రీనివాస్‌రావును మరోసారి కొనసాగించేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ గట్టి ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదని ఇక్కడ డీసీసీగా ఏలె మల్లికార్జుర్జున్‌ కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పట్టుబట్టి సాధించినట్లు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గానికి చెక్‌ పెట్టేందుకు డీసీసీ అధ్యక్షుడిగా మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే వినోద్‌ సన్నిహితుడిని ఎంపిక చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్‌రావు, సీనియర్లను పక్కనబెట్టి 2024లో పార్టీలోకి కొత్తగా చేరిన ఆత్రం సుగణకు అవకాశం ఇవ్వడంపై కూడా పార్టీ నేతలు పెదవి విరుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక సంగారెడ్డి, రంగారెడ్డి డీసీసీ పదవి కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినా ఇక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఏఐసీసీ ఈ రెండు స్థానాలను ఇంకా పెడింగ్ లోఉంచినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ గా నల్గొండ డీసీసీ:

ముఖ్యంగా నల్గొండ డీసీసీ పదవి తెలంగాణ కాంగ్రెస్‍లో హాట్ టాపిక్‍గా మారింది. ఇక్కడ ఉద్యమ నాయకుడు కైలాశ్ నేతను డీసీసీగా అధిష్టానం నియమించింది. అయితే కైలాశ్ గతంలో తనపై అసభ్యకర రీతిలో దూషణలకు దిగారని, అలాంటిది ఆయనకు ఎలా డీసీసీ ఇచ్చారని మంత్రి కోమటి రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఇష్యూ ఇంకా చల్లారడం లేదు. ఈ క్రమంలో నేడు తెలంగాణకు మీనాక్షి నటరాజన్ రాబోతుండటం ఆసక్తిగా మారింది. వారం రోజుల పాటు ఆమె రాష్ట్రంలోనే ఉండబోతున్నారు. పార్టీ, ప్రభుత్వంలోని తాజా పరిణామాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రకటించిన డీసీసీల నియామకం విషయంలో పార్టీలో నెలకొన్న గందరగోళానికి ఆమె చెక్ పెట్టబోతున్నారనే టాక్ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో కొత్త, పాత డీసీసీలతో భేటీ అయి కొత్తగా నియామకమైన డీసీసీలకు దిశ నిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నేడు తెలంగాణకు మీనాక్షి నటరాజన్ రాబోతుండటం ఆసక్తిగా మారింది. వారం రోజుల పాటు ఆమె రాష్ట్రంలోనే ఉండబోతున్నారు. పార్టీ, ప్రభుత్వంలోని తాజా పరిణామాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రకటించిన డీసీసీల నియామకం విషయంలో పార్టీలో నెలకొన్న గందరగోళానికి ఆమె చెక్ పెట్టబోతున్నారనే టాక్ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో కొత్త, పాత డీసీసీలతో భేటీ అయి కొత్తగా నియామకమైన డీసీసీలకు దిశ నిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం.

ప్రతిష్టాత్మక ఎన్నికల వేళ గందరగోళం:

రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక రకంగా ఈ ఎన్నికలు ప్రతిపక్షాల కంటే అధికార పక్షానికే అత్యంత ప్రతిష్టాత్మకం అనే టాక్ ఉంది. బీఆర్ఎస్ ప్రభావంతో గడిచిన పదేళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీన పడింది. బీఆర్ఎస్ హవా నడుస్తున్న తరుణంలో తాము గెలవమని భావించినా కేవలం పార్టీ కోసం బరిలోకి దిగిన కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి లిట్మస్ టెస్ట్ అనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలు పార్టీ సింబల్ తో జరగనప్పటికీ పార్టీ బలపరిచే అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకోవడం ద్వారా ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న లీడర్లకు అండగా నిలవడం, తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం అనే టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ముఖ్యమంత్రి సైతం ఈ ఎన్నికలపై సీరియస్‍గా దృష్టి సారించారు. ఈ ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటువంటి తరుణంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ల ద్వారా క్షేత్రస్థాయిలోకి అనుసంధానం చేసుకోవాల్సిన డీసీసీల వ్యవస్థలో ఈ గందరగోళం ఏర్పడటం ఇప్పుడు క్యాడర్‍లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఈ సమస్యకు ఎలాంటి ఎండ్ కార్డు వేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

Next Story