- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మచ్చలేని వ్యక్తికి వీసీ బాధ్యతలు ఇవ్వాలంటున్న వైద్య వర్గాలు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ(కేఎన్ఆర్ యూహెచ్ఎస్)లో గత కొంతకాలంగా వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ(కేఎన్ఆర్ యూహెచ్ఎస్)లో గత కొంతకాలంగా వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణల కారణంగా ఏకంగా వైస్ చాన్సలర్‌గా ఉన్న డా.నందకుమార్‌ను ప్రభుత్వం రాజీనామా చేయించిందంటే పరిస్థితి తీవ్రత ఎంటో అర్థమవుతుంది. పీజీ పరీక్షల రీవాల్యూయేషన్ నుంచి ఇన్‌చార్జి నియామకాల వరకు ఇటీవల రాజీనామా చేసిన వీసీ హయాంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి.
వీసీ పదవిలో ఉన్న 8 నెలల కాలంలోనే ఈ స్థాయిలో ఆరోపణలు రావడం, ఆయన పదవి నుంచి వైదొలగాల్సి రావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సరైన ట్రాక్ రికార్డ్ లేని వారిని ఇంతటి ఉన్నత పదవిలో నియమించే ముందు ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైద్యవర్గాలు అంటున్నాయి.
వైద్య విద్యకు ‘క్లీన్ హ్యాండ్స్’ అవసరం..
ఈ పరిణామాల నేపథ్యంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీని రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. రాష్ట్ర వైద్య విద్య భవిష్యత్తు కోసం నడిపించే నిజాయతీపరుడు, అనుభవం ఉన్న సీనియర్ విద్యావేత్తనే వీసీగా నియమించాలని వైద్యులు, వైద్య విద్యార్థులు, విద్యా నిపుణులు కోరుతున్నారు. పీజీ పరీక్షల రీవాల్యూయేషన్ పేరిట అక్రమాలు జరిగి, కోట్లాది రూపాయలు చేతులు మారి ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయినట్లు వచ్చిన ఆరోపణలు ఇప్పుడు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
“ఇలాంటి వాతావరణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుంది? అర్హత లేని వారు డాక్టర్లుగా రావడం సమాజానికి ఎంత ప్రమాదకరం?” అని వైద్య సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో భారీ డొనేషన్లతో సీట్లు కొనుగోలు చేసిన కొందరు.. పరీక్షల్లో ఫెయిల్ అయినా ‘డబ్బు ఉంటే పాస్ అవ్వొచ్చు’ అనే భావన పెరగడం వైద్య విద్య ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని.. వ్యవస్థ పూర్తిగా కూలిపోతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
వర్సిటీ రాజకీయ పునరావాస కేంద్రం కాకూడదు..
కాళోజీ వర్సిటీని రాజకీయాలు, బంధుత్వాలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు పునరావాసం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని... అది రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వైద్య విద్య నాణ్యతను నిర్ణయించే కీలక సంస్థ అని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే వీసీ నియామకంలో రాజకీయ జోక్యం ఉంటే, అది తిరిగి ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర గౌరవం, వైద్య విద్య ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదాన్ని ప్రభుత్వం గుర్తించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల ఆరోపణలు వచ్చిన ఐదుగురు ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీజీ విద్యార్థులు ఫెయిలై తిరిగి పాసయ్యారనే ఆరోపణలు రాగా.. ఈ ఐదుగురే కాదని ఇంకా అనేకమంది కొన్ని ప్రైవేటు కాలేజీలకు చెందిన వైద్య విద్యార్థులు ఫెయిలైనా... ఆమ్యామ్యాలు చెల్లించి పాస్ అయ్యారని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపితే విస్తుపోయే వాస్తవాలు ఎన్నో వెలుగులోకి వస్తాయని కొందరు వైద్య విద్యార్థులు చెబుతున్నారు. కొందరిని పాస్ చేసే క్రమంలో చాలా మంది మెరిట్ విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేశారని వాపోయారు. దీనిపై సీఎం, వైద్య మంత్రికి సైతం ఫిర్యాదు చేశారు.
ట్రాక్ రికార్డు చెకింగ్ చాలా అవసరం
అవినీతి ఆరోపణలు లేని, పరీక్షల నిర్వహణ, మెడికల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం, వైద్య రంగంలో గౌరవం ఉన్న అపారమైన అనుభవజ్ఞులను వీసీగా నియమించాలని వైద్యులు, వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ఇంత పెద్ద వ్యవస్థను ఓ వ్యక్తి చేతిలో పెట్టేటప్పుడు ఆయన ట్రాక్ రికార్డు ఓసారి చెక్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇంత పెద్ద పదవి చేతికొస్తే పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చనే ఆలోచనతో పైరవీ చేసే వారిని ప్రభుత్వ పెద్దలు దూరం పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని కోరుతున్నారు. “వీసీగా ఎవరొచ్చినా అది ఒక ఉద్యోగం కాదు.. రాష్ట్ర వైద్య వ్యవస్థ భవిష్యత్” అని వారు స్పష్టంగా చెబుతున్నారు.
ప్రభుత్వంపై ఆశలు...
ఇటీవలి ఘటనల వల్ల కాళోజీ వర్సిటీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రచారం ఎదుర్కొంది. “ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో విచారణ చేసి, నిజాయితీ ఉన్న విద్యావేత్తను వీసీగా తీసుకురావాలి. అప్పుడు మాత్రమే వర్సిటీ గాడిన పడుతుంది” అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భవితవ్యం ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. సరైన నిర్ణయం తీసుకోకపోతే వేలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుంది. అవినీతి ఆరోపణలు రాగానే వీసీతో రాజీనామా చేయించిన సర్కారు.. సరైన వ్యక్తిని ఎంపిక చేసే విషయంలోనూ అంతే కఠినంగా వ్యవహరించటాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. ఒక సరైన నిర్ణయం తెలంగాణ వైద్య విద్యను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అవకాశం కల్పించనుంది. వైద్యులు, విద్యార్థులు, ప్రజల ఏకైక ఆకాంక్ష.. అవినీతి రహితంగా వర్సిటీని ముందుకు నడిపించే నాయకత్వాన్ని ప్రభుత్వం వెంటనే నియమించాలని అనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోని విద్యాసంస్థలు ఇవే
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వైద్య విద్యతో పాటు డెంటల్, ఆయుష్, ఫిజియోథెరపీ, నర్సింగ్, అల్లైడ్ హెల్త్ సైన్సెస్, ల్యాబ్ టెక్నాలజీ, ఎంపీహెచ్ యూజీ, పీజీ కోర్సుల్లో వేలాది మంది విద్యార్థులు ఏటా చేరుతున్నారు. ఆల్ ఇండియా కోటాలోనూ అనేక మంది విద్యార్థులు రాష్ట్రంలో చేరుతున్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ విద్యను అందించే కాలేజీలు 66 ఉన్నాయంటే కాళోజీ వర్సిటీ ప్రాధాన్యమేంటో అర్థం చేసుకోవచ్చు.






