- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
“సర్” ప్రక్రియపై అవగాహన.. ఆందోళన వద్దు.. ఆన్‌లైన్‌లోనూ అవకాశం!
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అతిపెద్ద ఓటరు నియోజకవర్గాల్లో కుత్బుల్లాపూర్ ఒకటిగా నిలిచింది.

దిశ, పేట్ బషీరాబాద్: 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అతిపెద్ద ఓటరు నియోజకవర్గాల్లో కుత్బుల్లాపూర్ ఒకటిగా నిలిచింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం కుత్బుల్లాపూర్‌లో 6,99,239 మంది ఓటర్లు తో కుత్బుల్లాపూర్ రెండో స్థానంలో నిలిచింది. సర్ ( స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్) ప్రక్రియకు ముందు ఎన్నికల శాఖ నిర్వహించిన ఓటరు డేటా మ్యాపింగ్‌లో ఉప్పల్‌లో 73 శాతం, కూకట్‌పల్లిలో 60 శాతం, మల్కాజిగిరిలో 59 శాతం అసంగతతలు ఉండగా ఒక్క కుత్బుల్లాపూర్‌లోనే అత్యధికంగా 78 శాతం అసంగతతలు గుర్తించబడటం ఎన్నికల శాఖకు సవాలుగా మారింది. దీంతో ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు సోమవారం ఆయన నియోజకవర్గంలో చేపట్టబోయే "ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR)" ప్రక్రియపై కీలక విషయాలను వెల్లడించారు.
592 బిఎల్ఓ లతో…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జనాభా పెరుగుదల, ఐటీ రంగ విస్తరణ, కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం మరియు భారీ వలసల కారణంగా ఓటర్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. గత 2023 శాసనసభ ఎన్నికల నాటికే ఇక్కడ ఓటర్ల సంఖ్య 6,99,239 గా నమోదై రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. ఈ భారీ నియోజకవర్గంలో SIR ప్రక్రియను పక్కాగా నిర్వహించేందుకు మొత్తం 592 పోలింగ్ స్టేషన్లకు గానూ 592 మంది బీఎల్ఓలు, వీరి పర్యవేక్షణ కోసం 64 మంది సూపర్‌వైజర్లు, ఉన్నత స్థాయి పర్యవేక్షణ కోసం 17 మంది ఏఈఆర్‌ఓలు పని చేయనున్నట్లు జోనల్ కమిషనర్ తెలిపారు. డిప్యూటీ కమిషనర్లు, తహసీల్దార్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు ఈ ఏఈఆర్‌ఓలుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
“నెల రోజుల పాటు ఇంటింటి సర్వే
ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన మొదటి దశ లో ‘ఇంటింటి గణన’ చేపట్టనున్నారు. జూలై 24 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ప్రత్యేక శిక్షణ పొందిన బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ‘ఎన్యూమరేషన్ ఫారాలను’ రెండు కాపీలుగా అందజేస్తారు. ఫారం ఎలా పూరించాలో వివరించి, తదుపరి సందర్శనలో వాటిని సేకరించి ఓటర్లకు రసీదు ఇస్తారు. ఓటరు సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా ఫారంలో ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్ఛికం మాత్రమేనని, ఎవరూ దీన్ని నిర్బంధంగా భావించాల్సిన అవసరం లేదని జెడ్ సి పేర్కొన్నారు.
డూప్లికేట్లు, మరణించిన వారి వివరాల ఏరివేత
"గత 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరు సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఒకే ఓటరు రెండు చోట్ల నమోదై ఉండటం, మరణించిన వారి పేర్లు అలాగే కొనసాగడం, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు, అనుమానాస్పద ఎంట్రీలను గుర్తించి ఎన్నికల నిబంధనల ప్రకారం తొలగిస్తాం. ప్రతి ఇల్లూ బీఎల్ఓ కనీసం మూడు సార్లు సందర్శిస్తారు." అని జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, జోనల్ కమిషనర్ తెలిపారు.
ఆందోళన వద్దు.. ఆన్‌లైన్‌లోనూ అవకాశం!
బీఎల్ఓలు ఇళ్లకు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోయినా ఓటు హక్కు కోల్పోతారనే భయం అవసరం లేదని జోనల్ కమిషనర్ స్పష్టం చేశారు. కుటుంబంలోని మరో పెద్ద సభ్యుడు ఆ ఫారం అందుకోవచ్చు. లేదా ఓటర్లు స్వయంగా ఈసీ అధికారిక వెబ్‌సైట్లయిన voters.eci.gov.in, ecinet.eci.gov.in, eci.gov.in లలో లాగిన్ అయి ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన తర్వాత కూడా తప్పుల సవరణకు ‘క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్’ ద్వారా మరో అవకాశం ఉంటుందని అన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్త ఓటు నమోదు కోసం ఫారం-6 ద్వారా బీఎల్ఓలకు దరఖాస్తులు అందజేయవచ్చు. అలాగే చిరునామా మార్పులు కోరుకునే వారు జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
‘SIR’ ప్రక్షాళన షెడ్యూల్ ఇదే..
2016 జూన్ 25 నుంచి జూన్ 24 వరకు ఇంటింటి సర్వే, జులై 31న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు విచారణలు నోటీసులు జారీ ప్రక్రియ, అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు జోనల్ కమిషనర్ తెలిపారు.
ప్రత్యేక హెల్ప్ డెస్కులు
ఓటర్ల సౌకర్యార్థం నియోజకవర్గ వ్యాప్తంగా 10 ప్రత్యేక హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో 6, ఎంఆర్ఓ ఆఫీసుల్లో 3, జెడ్సీ/ఈఆర్ఓ కార్యాలయంలో 1 హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటాయి అని , కుత్బుల్లాపూర్‌లో వంద శాతం పారదర్శకమైన, స్వచ్ఛమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ప్రజలంతా క్షేత్రస్థాయికి వచ్చే అధికారులకు సరైన వివరాలు అందించి, పూర్తి స్థాయిలో సహకరించాలని జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.






