- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక రోజు ముందు నుంచే బతుకమ్మ వేడుకలు.. ఆ గ్రామ ప్రత్యేకత ఇదే!
తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా, ప్రకృతి నుంచి లభించే పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ.

దిశ, కూకట్పల్లి: తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా, ప్రకృతి నుంచి లభించే పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ. తెలంగాణ వ్యాప్తంగా ఆడపడుచులు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగకు కూకట్పల్లి గ్రామం ముస్తాబవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ వేడుకలలో కూకట్పల్లి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతుండగా కూకట్పల్లి మాత్రం అమావాస్యకు ఒక రోజు ముందే బతుకమ్మ వేడుకలు ప్రారంభించడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది.
ఒక రోజు ముందే గ్రామానికి చెందిన మహిళలు బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. గ్రామం నుంచి దేశ విదేశాలలో, పొరుగు రాష్ట్రాల్లో, వేరే ఊర్లలో నివసిస్తున్న గ్రామ ఆడబిడ్డలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు తమ పుట్టింటికి చేరుకుంటారు. 9 రోజుల పాటు రంగు రంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజిస్తారు. విజయదశమికి ఒక రోజు ముందు సద్దుల బతుకమ్మ వేడుకలను చూసేందుకు కూకట్పల్లి పరిసర ప్రాంతాల నుంచి లక్షలాది సంఖ్యలో జనం కూకట్పల్లి బాట పడతారు. సద్దుల బతుకమ్మ నాడు గ్రామానికి చెందిన ప్రతి ఇంటి నుంచి భారీ బతుకమ్మలను పేర్చి గ్రామ పురవీధులలో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలిస్తారు.
బతుకమ్మ వేడుకలు..
కూకట్పల్లి గ్రామంలో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతాయని విజయదశమి, బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 20వ తేదీ బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాగా 21వ తేదిన ఆదివారం పెద్దల అమావాస్య, 27వ తేదిన శనివారం అట్ల బతుకమ్మ, 28వ తేది అలిగిన బతుకమ్మ( బతుకమ్మ వేడుకలు ఉండవు), 29వ తేదిన సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2వ తేదిన విజయ దశమి, కూకట్పల్లి గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద 5:30 గంటలకు జమ్మి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు కంచనపల్లి నాగరాజు, తులసి శ్రీనివాస్ రావులు తెలిపారు.






