వయోజన విద్యకు ఉల్లాస్

by Ajay Maddhiboyina |

సంపూర్ణ అక్షరాస్యతకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. అందరికీ విద్య(వయోజన విద్య)లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

వయోజన విద్యకు ఉల్లాస్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : సంపూర్ణ అక్షరాస్యతకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. అందరికీ విద్య(వయోజన విద్య)లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. నూతన విద్యావిధానం 2020లో భాగంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. గతంలో సాక్షరత భారత అమలు చేయగా దాని స్థానంలో నవభారత సాక్షరత తీసుకొచ్చింది. నవభారత సాక్షరత కార్యక్రమ నిర్వహణకు జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, కన్వీనర్‌గా డీఈవో, డీపీవో, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా, మండల కమిటీలో చైర్మన్‌గా ఎంపీడీవో, ఎంఈవో, ఎంపిక చేసిన హెచ్ఎం, సీఆర్సీలు సభ్యులుగా కొనసాగుతారు.

‘ఉల్లాస్’ యాప్ ద్వారా..

వయోజన విద్య అమలుకు గాను ‘ఉల్లాస్’ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ది సొసైటీ) యాప్‌ను రూపొందించింది. కార్యకలాపాలాన్ని యాప్ ద్వారా కొనసాగనున్నాయి. 15 ఏళ్ల పైబడి, ప్రాథమిక విద్యకు నోచుకోని వారు, మధ్యలోనే బడి మానేసి అక్షరాలు మరిచిపోయిన వారిని గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో గుర్తిస్తారు. నవభారత సాక్షరత కోసం కేంద్రం తీసుకువచ్చిన ‘ఉల్లాస్’ అనే యాప్‌లో నిరక్షరాస్యుల వివరాలను పొందుపరుస్తారు. వీరి విద్యా బోధనకు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లను వలంటీర్లుగా ఎంపిక చేశారు. ఒక్కో వలంటీర్‌కు 10 మంది బ్యాచ్ చొప్పున ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది.

48,787 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దెందుకు..

మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో 2022-2027 విద్యా సంవత్సరంలో 48,787 మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం సరిపడ వలంటీర్లను నియమించారు. ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లు, గ్రంథాలయాలు లేదా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రదేశంలో విద్యాబోధనలకు సిద్ధం చేస్తున్నారు. అక్షరవికాసం కోసం మార్గదర్శిని, వర్క్ షీట్, ఎన్‌సీఈఆర్‌టీ, దిక్ష పోర్టల్‌ను వినియోగించనున్నారు. మాతృభాషలోనే విద్యాభోదన చేయనున్నారు. డీటీహెచ్ టీవీ-14 చానల్‌లో కూడా బోధనకు సంబంధించిన ప్రచారాలను నిర్వహిస్తున్నారు.

మహిళలపై ప్రత్యేక పోకస్..

జిల్లాలో 3,542 మహిళా సంఘాలు ఉండగా, అందులో 32,700 మంది సభ్యులు ఉన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని నిరక్ష్యరాశులు అయిన మహిళలను గుర్తించి, 100 శాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారు. మహిళల్లో నిరక్షరాస్యులను గుర్తించి, అక్షర జ్ఞానం కల్పించడంతో పాటు డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి తిరిగి ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో చేర్పించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో వయోజన విద్య, సమగ్ర శిక్షా, ఓపెన్ స్కూల్, సెర్చ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. వయోజన విద్యలో ప్రతిభకనరిచిన వారికి స్వయం ఉపాధి కల్పిస్తారు. మగ్గం, బ్యూటీషియన్ , టైలరింగ్ తదితర అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు.

సక్సెస్ చేస్తాం..

- కొడ్మూరి అనిత, జిల్లా వయోజన విద్యాధికారి

నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయడమే లక్ష్యంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ఇప్పటికే వలంటీర్లకు శిక్షణ ఇచ్చాం. ప్రాజెక్ట్ 2022- 2027 వరకు అనగా 5 ఏళ్ల పాటు ఉంటుంది. చదవడం, రాయడం, సంఖ్యా జ్ఞానం పొందడం వంటివి, వీడియో రూపంలో బోధన ఉంటుంది. విద్యతో పాటు డిజిటల్ లావాదేవీలు, జీవ నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా అవగాహన కల్పిస్తాం.

Next Story