- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుర ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
పురపాలిక ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు.

-68 వార్డులకు 136 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
-818 మంది ఆర్వోలు, ఏఆర్వోల నియామకం
--65 సమస్యాత్మక కేంద్రాలకు ప్రత్యేక భద్రత
-ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు
-మూడు వేర్వేరు ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
మేడ్చల్ జిల్లా పరిధిలో జరగనున్న పురపాలిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను వేగవంతం చేసింది. మూడు మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. భద్రత, సిబ్బంది నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పురపాలిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తెలిపారు. 68 వార్డులకు 136 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 818 మంది ఆర్వోలు-ఏఆర్వోలను నియమించామని, 65 సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రతతో పాటు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : పురపాలిక ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ఈ నెల 11న జిల్లాలోని మూడు చింతలపల్లి, ఎల్లంపేట, ఆలియాబాద్ ల మూడు మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికల సన్నద్దతపై మంగళవారం ‘దిశ’ నిర్వహించిన ముఖాముఖిలో కలెక్టర్ మను చౌదరి పలు విషయాలను వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు..
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలికసదుపాయాలు కల్పించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. మూడు చింతలపల్లి లో 24 వార్డులుండా, 48 పోలింగ్ స్టేషన్లు, ఆలియాబాద్ లో 20 వార్డులకు 40 పోలింగ్ కేంద్రాలు,ఎల్లంపేటలో 24 వార్డుల కోసం 48 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాం.
ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ..
మూడు మున్సిపాలిటీలలో కలిపి మొత్తం 65,866 ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 33,051 మంది, మహిళ ఓటర్లు 32,812 మంది, ట్రాన్స్ జెండర్లు ముగ్గురు ఉన్నారు.మొత్తం 68 వార్డులకు గాను 136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఓటింగ్ శాతాన్నిపెంచేందుకు ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం.పలు ప్రదర్శనల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతన తెలియజేశాం.
65 సమస్యాత్మక కేంద్రాలు..
పుర పరిధిలో మొత్తం 136 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా,ఇందులో 65 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం, ఆదనపు పోలీసు సిబ్బందితో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటాం. ఈ సమస్యాత్మక కేంద్రాలతోపాటు అన్ని పోలింగ్ కేంద్రాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తాం. ఆయా మున్సిపాలిటీలలో వార్డులను జోన్లుగా విభజించి, ఆయా రూట్లలో పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం.
సిబ్బంది నియామకం..
రెండు పొలింగ్ కేంద్రాలకు ఒక ఆర్వో(రిటర్నింగ్ అధికారి)ను నియమించాం. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్స్ లతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రిని సైతం అందుబాటులో ఉంచాయి. జిల్లా స్థాయి ర్యాంకు కలిగిన అధికారులను నోడల్ అధికారులుగా నియమించాం. అదేవిధంగా 818 మంది రిటర్నింగ్ (ఆర్వోలు),అసిస్టెంట్ రిటర్నింగ్ (ఏఆర్వోలు) అధికారులను ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశాం.మైక్రో అబ్జర్వర్లను ఎంపిక చేశాం.ఇప్పటికే జోనల్ అధికారులు, సర్వే లెన్స్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్ (ఎఫ్ ఎస్ టీ) బృందాలను రంగంలోకి దించాం. ప్రతి కేంద్రానికి ఒక బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేసి, ఆదనంగా 20 శాతం బాక్స్ లను రిజర్వు చేశాం.
కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై..
మూడు మున్సిపాలిటీలకు గాను మూడు వేర్వేరు చోట్ల ఓట్ల కౌంటింగ్ సెంటర్ల ను ఏర్పాటు చేశాం. మూడు చింతల పల్లి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కోసం జగ్గన్ గూడ్ లోని మైనారిటీ గురుకుల విద్యాలయాన్ని ఎంపిక చేశాం. అదేవిధంగా ఆలియా బాద్ పురపాలక ఓట్ల లెక్కింపు కోసం మజీద్ పూర లోని శ్రీ చైతన్య స్కూల్ ను , ఎల్లంపేట మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కోసం డబీల్పూర్ గ్రామంలోని బైబిల్ కాలేజ్ ను ఎంపిక చేశాం.ఓట్ల లెక్కింపు కోసం విశాలంగా ఉండేలా ఏర్పాట్లు చేశాం. లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నాం.ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం






