మేడిపల్లి పరిధిలో మరో సారి దొంగల హ‌ల్ చ‌ల్

by Ratna Kumari |

మల్కాజ్ గిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరోమారు దొంగలు హ‌ల్ చ‌ల్ చేశారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మేడిపల్లి పరిధిలో మరో సారి దొంగల హ‌ల్ చ‌ల్
X

‎దిశ‌, మేడిప‌ల్లి : మల్కాజ్ గిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరోమారు దొంగలు హ‌ల్ చ‌ల్ చేశారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా కాముగా ఉన్న దొంగలు పంజా విసిరారు. వరుస దొంగతనలతో పలు కాలనీవాసులు కునుకు లేకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఎన్ఐఎన్ కాలనీ, పీర్జాదిగూడ మల్లికార్జున్ నగర్‌లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్ఐఎన్ కాలనీకి చెందిన పెండ్యాల గీతా భవాని శంకర్ మార్చి 30న తమిళనాడులోని మదురైకు వెళ్లి, ఏప్రిల్ 8న తిరిగి ఇంటికి రాగా ప్రధాన ద్వారం తాళం పగులగొట్టబడినట్లు గుర్తించారు. ఇంట్లోని బీరువా తెరిచి ఉండగా సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి సామగ్రి దొంగిలించబడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక పీర్జాదిగూడ మల్లికార్జున్ నగర్‌లో ఎలగందుల శ్రీరాములు ఇంట్లో కూడా ఇదే తరహా చోరీ జరిగింది. శ్రీరాములు తన సోదరుడు మరణించడంతో ఈనెల 6న వారాసిగూడకు వెళ్లి, 8న తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 5 తులాల బంగారం, రూ.1.60 లక్షల నగదు దొంగిలించబడినట్లు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి, కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.వరుసగా జరుగుతున్న చోరీలతో స్థానికులు భయంతో గడుపుతున్నారు. ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లడానికే భయపడుతున్నామని వాపోతున్నారు. కాలనీల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచి, దొంగతనాలను అరికట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Next Story