కదిలిన అధికార యంత్రాంగం

by Yella Dhawani Reddy |

అక్రమ సంపాదన కోసం అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు స్థానికంగా జోరుగా వినిపిస్తున్నాయి.

కదిలిన అధికార యంత్రాంగం
X

దిశ, దుండిగల్ : అక్రమ సంపాదన కోసం అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు స్థానికంగా జోరుగా వినిపిస్తున్నాయి. బడా నిర్మాణ సంస్థకు అధికారులు, పరోక్ష సహకారం అందిస్తుండగా అధికార పార్టీ నాయకుడి అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే టాక్ వినబడుతుంది. అక్రమార్కులు రోడ్డు విస్తరణ కోసం అడిగిందే తడవుగా మున్సిపల్ కమిషనర్ 23 జూన్ 2025న ఎల్ఆర్ నంబర్ 93/డిఎం/టిపిఎస్/ఎంఎండి/2025 పేరుతో సర్వే నంబర్ 156,166/3,166/1,147,146కు జియో కో ఆర్డినెట్స్ ఆధారంగా 40 ఫీట్ రోడ్డు‌కు అలైన్మెంట్ స్కెచ్ మ్యాప్ ఇవ్వాలని తహసీల్దార్‌కు లేఖ రాయడం, సర్వేయర్ పరమేశ్వర్‌తో సర్వే చేయించి మున్సిపల్ కమిషనర్‌కు తహశీల్దార్ రిపోర్ట్ అందించడం చకచకా జరిగిపోయాయి. వెరసి అధికారుల పర్యవేక్షణలో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికార పార్టీకి అధికారులు దాసోహం..

అధికార పార్టీ నాయకులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి, నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ అంతే తేడా, బౌరంపేట సర్వే నంబర్ 166 ప్రభుత్వ భూమి పలు బైనంబర్ల ద్వారా సుమారు 542.19 ఎకరాలు విస్తరించి ఉంది. అందులో కొంత భాగం రక్షణ శాఖకు కేటాయుంచగా మిగిలిన భాగాన్ని పొలిటికల్ సఫరర్స్‌కు కేటాయించారు. లబ్ధిదారులు సదరు భూమితో పంటలు పండించుకోవాల్సి ఉంటుంది. కాగా కొందరు లబ్ధిదారులు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, అధికార పార్టీ నాయకులు వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం అసైన్డ్ భూములుగా ఉండడంతో నిర్మాణం చేపట్టాలంటే కలెక్టర్ నుంచి ఎన్ఓసీ తప్పనిసరి, అధికారుల అండతో బడా నిర్మాణ సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎటువంటి ఎన్ఓసీ లేకుండా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులకు అప్పటి బీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు అండగా నిలవగా, ప్రస్తుతం బౌరంపేటకు చెందిన అధికార పార్టీ యువ నాయకుడు అండగా నిలిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కదిలిన అధికార యంత్రాంగం

బౌరంపేట సర్వే నంబర్ 166/3, సర్వే నంబర్ 166/1 ప్రభుత్వ భూమిలో జేఎన్ఎస్, రుద్రా నిర్మాణ సంస్థల కోసం రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రభుత్వ భూమిని తాకట్టుపెట్టారు. గ్రామ నక్షలో ఉన్న బండ్ల బాటను 40 ఫీట్ రోడ్డుగా మలుస్తుండడంతో గత వారం రోజులుగా దిశ దినపత్రికలో వరుస కథనాలు వెలువడ్డాయి. దీనికి స్పందించిన మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి విచారణ అధికారిగా మల్కాజిగిరి ఆర్డీఓ శ్యాంప్రకాష్‌ను నియమించారు. ఆర్డీఓ ప్రభుత్వ భూమిలో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులపై శనివారం దర్యాప్తు ప్రారంభించారు. గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరిపి ఆర్డీఓ వెనుతిరగడం పలు అనుమానాలకు తావిస్తుంది.

సర్వే రిపోర్ట్ ఆధారంగా చర్యలు

- శ్యాంప్రకాష్, ఆర్డీఓ

ప్రభుత్వ భూమిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనునులపై ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక అధికారులతో కలిసి శనివారం విచారణ చేపట్టాం. సర్వే నిర్వహించి రిపోర్ట్ పంపాలని తహశీల్దార్‌, సర్వేయర్‌కు సూచించాం. రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయి.

Next Story