నిరుపేదలపైనే ‘హైడ్రా’ పంజా..? బడాబాబుల ఆక్రమణలపై చర్యలెక్కడ!

by Kema Shiva Kumar |

చెరువులను చెరబడితే కఠినంగా శిక్షిస్తాం.. జలవనరుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తోంది, చెరువుల ఆక్రమణదారుల్లో బడా బాబులున్నా, నాయకులను సైతం విడిచిపెట్టమని హైడ్రా కమిషనర్ చేసిన వ్యాఖ్యలు నీటిమూటలే అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిరుపేదలపైనే ‘హైడ్రా’ పంజా..? బడాబాబుల ఆక్రమణలపై చర్యలెక్కడ!
X

దిశ, మేడ్చల్ బ్యూరో: చెరువులను చెరబడితే కఠినంగా శిక్షిస్తాం.. జలవనరుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తోంది, చెరువుల ఆక్రమణదారుల్లో బడా బాబులున్నా, నాయకులను సైతం విడిచిపెట్టమని హైడ్రా కమిషనర్ చేసిన వ్యాఖ్యలు నీటిమూటలే అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంపల్లిలోని ఫాక్స్‌సాగర్ చెరువును నివాస ప్రాంతంగా మార్చివేస్తున్నా, హైడ్రా పట్టనట్టు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెరువుల పరిరక్షణ పేరిట హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి మాత్రమే తీసుకువెళ్లుతుందని, బఫర్ జోన్‌లో భూములను బాడా బాబులు నేరుగా రెసిడెన్షియల్ జోన్లుగా మార్చేందుకు యత్నించిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మాజీ మంత్రి అండతో..

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక చెరువులు మాయమవ్వగా, మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి చారిత్రక చెరువుపై కన్నేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తు వ్యూహం ప్రకారం కొంపల్లిలోని ఫాక్స్ సాగర్ చెరువు సర్వే నంబర్ 151, 179/సీ లోని బఫర్ జోన్ స్థలాన్ని కొనుగోలు చేశాడని తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి తన పలుకుబడితో తనయుడి పేరిట ఉన్న భూముల్లో నిర్మాణాలకు అనుమతులను ఇప్పించారనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీషిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థ ఫాక్స్ సాగర్ చెరువు పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి అపార్ట్‌మెంట్ నిర్మాణానికి అనుతులు పొందినట్లు స్పష్టమవుతోంది. 2013లోనే చెరువు, చుట్టు పక్కల ప్రాంతాల గుర్తింపు సర్వేలు ఉన్నప్పటికీ, తప్పుడు నివేదికలను సమర్పించి అనుమతులు పొందినట్లు తెలిసింది. మాజీ మంత్రి అధికార బలానికి తలొగ్గిన హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 2014లో జరిగిన సర్వే, గూగుల్ కో ఆర్డినేట్స్‌లను పట్టించుకోకుండా గుడ్డిగా ఇరిగేషన్, రెవెన్యూ ఇచ్చిన ఎన్వోసీలతో హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

హైడ్రాకు భయమెందుకు..

నగరం నడిబోడ్డున చారిత్రక ఫాక్స్ సాగర్ చెరువు స్థలాన్ని కబ్జా చేసి భారీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నా, అమాయకులకు విక్రయిస్తున్నా హైడ్రా కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణాలంటూ సామాన్యులపైనే హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోందని, బడా బాబులు, రాజకీయ నాయకుల సంబంధీకుల జోలికి వెళ్లడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఫాక్స్ సాగర్‌లో నిర్మించిన అపార్ట్‌మెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అనుమతులున్నప్పటికీ..

ఫాక్స్ సాగర్ చెరువులో నిర్మించిన అపార్ట్‌మెంటకు అనుమతులున్నా.. ప్లాట్లను కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఇరిగేషన్ శాఖ ఎన్‌వోసీతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చిన లే అవుట్లు, అపార్ట్‌మెంట్ల విషయంలోనూ వివాదాలు నడుస్తున్నాయి. అనుమతులు ఉన్నట్లు తేలినా మరోసారి కొనుగోలుదారులు చెక్ చేసుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో అయితే మాస్టర్ ప్లాన్ 2030 తీసుకోవాలని, కొనుగోలుదారులు మీ ప్లాట్లకు చెరువులు, జలవనరులు ఎంత దూరంలో ఉన్నాయి అనే విషయం కచ్చితంగా తెలుసుకోవాలని కోరుతున్నారు.

Next Story