- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్యాలయం ఖాళీ.. ఆటల్లో అధికారులు!
ప్రజా సమస్యల పరిష్కారం, పారిశ్రామిక అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుదారులకు సేవలందించాల్సిన ప్రభుత్వ కార్యాలయం బోసిపోయింది.

దిశ, పేట్ బషీరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం, పారిశ్రామిక అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుదారులకు సేవలందించాల్సిన ప్రభుత్వ కార్యాలయం బోసిపోయింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా కార్యాలయ సిబ్బంది, అధికారులు అందరూ మూకుమ్మడిగా విధులకు గైర్హాజరైన ఉదంతం తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) మేడ్చల్, సిద్దిపేట జోనల్ కార్యాలయంలో గురువారం కనిపించింది. అధికారికంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు సిబ్బంది మొత్తం అక్కడికి వెళ్లడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
జీడిమెట్లలో అటెండర్.. ఇక్కడ మాత్రం అంతా ఖాళీ
ఒకే సంస్థకు చెందిన పక్కపక్క కార్యాలయాల నిర్వహణలో ఉన్న వ్యత్యాసం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. టీజీఐఐసీ పరిధిలోని జీడిమెట్ల ఐలా కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ.. అక్కడ కనీసం వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి ఒక అటెండర్‌ను అందుబాటులో ఉంచారు. ఇన్-వార్డ్ సెక్షన్‌కు ఏవైనా అర్జీలు లేదా లేఖలు వస్తే.. ఉన్నతాధికారికి ఫోన్ చేసి, ఆయన అనుమతితో వాటిని స్వీకరించి, స్టాంప్ వేసి ఇస్తానని సదరు అటెండర్ పేర్కొన్నాడు. జీడిమెట్లలో కనీసం ఈ మాత్రం సౌలభ్యం కల్పించినప్పటికీ.. మేడ్చల్-సిద్దిపేట జోనల్ కార్యాలయంలో మాత్రం కనీసం ఆ ఏర్పాటు కూడా లేకపోవడం గమనార్హం.
కాపలాగా ప్రైవేటు సెక్యూరిటీ మాత్రమే..
వివిధ పనుల నిమిత్తం గురువారం మేడ్చల్ కార్యాలయానికి వచ్చిన సందర్శకులకు అక్కడ కేవలం ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు మాత్రమే దర్శనమిచ్చాడు. లోపల ఒక్క అధికారి గానీ, క్లర్క్ గానీ , కనీసం ఇన్వార్డులో దరఖాస్తులు తీసుకోవడానికి అటెండర్ కానీ అందుబాటులో లేరు. విషయం ఏంటని ఆరా తీసేందుకు ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఎల్‌బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయని, అందుకే అధికారులంతా అక్కడికి వెళ్లారని, మళ్లీ సోమవారం నుంచే అందుబాటులోకి వస్తారని కింది స్థాయి సిబ్బంది ద్వారా తెలుస్తుంది.
సమాచారం లేకపోవడంపై తీవ్ర విమర్శలు
ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించడం మంచిదే అయినప్పటికీ.. దానికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని కార్యాలయ నోటీస్ బోర్డుపై ఎందుకు ప్రదర్శించలేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. జీడిమెట్లలో ప్రత్యామ్నాయంగా అటెండర్‌ను పెట్టి అర్జీలు తీసుకుంటుంటే.. ఇక్కడ మాత్రం కనీసం దరఖాస్తులు తీసుకోవడానికి కూడా ఎవరినీ ఉంచకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆటల పోటీలు ఎన్ని రోజులు జరుగుతాయి? కార్యాలయం ఎప్పటి వరకు మూసి ఉంటుంది? పనుల కోసం వచ్చే వారు ఏ రోజున రావాలి? అనే కనీస వివరాలను కూడా బోర్డుపై పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందని , ప్రభుత్వ అధికారులు సిబ్బంది క్రీడలలో పాల్గొనడం ఆహ్వానించ తగిన పరిణామమే అయినప్పటికీ, ముందస్తు సమాచారం లేదా కనీసం ఒక్కరినైనా సిబ్బందిని అందుబాటులో ఉంచకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం, రవాణా ఖర్చులు భరించి వచ్చే ప్రజలను ఇలా కనీస సమాచారం లేకుండా ఇబ్బందులకు గురిచేయడంపై సర్వత్రా విమర్శ వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఇలాంటి సమయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






