- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెటిల్ మెంట్ అడ్డాలుగా ఠాణాలు..!
శివారు ఠాణాలు సెటిల్ మెంట్లకు అడ్డాలుగా మారాయి.ఫిర్యాదుదారులే లక్ష్యంగా పలువురు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఎవరి స్టైల్ లో వారు వాసూళ్లకు పాల్పడుతున్నారు.

సెటిల్ మెంట్ అడ్డాలుగా ఠాణాలు..!
ఆ ఠాణాల అధికారుల రూటే సెపరేటు
భూ వివాదాలే వారి ప్రధాన ఆదాయ మార్గాలు
శివారు పోలీస్ స్టేషన్ల అధికారుల మామూళ్ల బాగోతం
రాజీ కుదిర్చేందుకు ఓ రేటు..లేదంటే అక్రమ కేసుల బనాయింపు
దిశ,మేడ్చల్ బ్యూరో : శివారు ఠాణాలు సెటిల్ మెంట్లకు అడ్డాలుగా మారాయి.ఫిర్యాదుదారులే లక్ష్యంగా పలువురు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఎవరి స్టైల్ లో వారు వాసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా... సదరు అధికారులు వారికున్న రాజకీయ అండదండలతో ఆయా పోలీస్ స్టేషన్లలో ఏండ్ల నుంచి పాతుకుపోయారు. పీఎస్ లలో సెటిల్ మెంట్లకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా సదరు అధికారులు అందులో వెంటనే దూరిపోతున్నారు. ఇరు వర్గాలతో మాట్లాడి ఎవరైతే ఎక్కువ అమ్యామ్యాలు ఇస్తారో వారికి వత్తాసు పలుకుతున్నారు.సామాన్యుల కంప్లైంట్స్ పైన మాత్రం ఏలాంటి రియాక్షన్ ఉండదని పలువురు వాపోతున్నారు.
సెటిల్ మెంట్లు.. బెధిరింపులు..
రాజీవ్ రహదారి సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్ లో పనిచేస్తున్న మహిళపై యాజమాని దురుసుగా ప్రవర్తించడంతో బాధితురాలు సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన పోలీసులు,ఓ అధికార పార్టీ నేత మధ్యవర్తిత్వంతో టిఫిన్ సెంటర్ యాజమాని నుంచి రూ.లక్షల్లో మామూళ్లు దండుకొని కేసును క్లోజ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా మరో పోలీస్ స్టేషన్ కు ఓ భూమి పంచాయితీ వచ్చింది. సంబంధిత కేసులో రెండు వర్గాల మధ్య వారసత్వ గొడవ జరుగుతోంది. ఇందులో కొంత భూమిని కొనుగోలు చేసి తమ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నవారు భూమి వద్దకు వెళ్లితే .. అక్కడ వేరే వాళ్లు కబ్జాలో ఉండడంతో వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది.ఈ వ్యవహారంలో అక్కడి స్టేషన్ హౌస్ ఆఫీసరు భూమి కొనుగోలు చేసిన వ్యక్తులను బెదిరించి, అందుకు నజరానా గా అవతల వారి నుంచి రూ. లక్షల్లో మామూలు తీసుకున్నారని, అదే భూ కబ్జాదారులకు సంబంధించిన మరో కేసును పక్కనే ఉన్న ఠాణా పరిధిలోకి రావడంతో అక్కడి అధికారితో సెటిల్ మెంట్ చేసినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
వినకుంటే అక్రమ కేసులు..!
తమ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లలో ఏ ఫిర్యాదు వచ్చినా సిబ్బందిలో ఒకరిద్దరిని తన అనుచురులుగా పెట్టుకుని ముందు వారితో మాట్లాడించి సెటిల్ మెంట్ కు ఒప్పించడం..ఒకవేళ తమ మాట వినకుంటే (డీల్ కుదరకపోతే) ఎదుటి వ్యక్తులపై కేసులు పెట్టడం ఇది ప్రస్తుతం శివారు పీఎస్ లలో జరుగుతున్న నయా ట్రెండ్.కేసు నమోదు చేయాలంటే ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ఓ రేటు, ఒకవేళ ఒకరు వినకపోతే వారిపై కేసు పెట్టాలి..అంటూ కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని శివారు ప్రాంతాల ఠాణాలకు వచ్చే కేసులన్నీ దాదాపుగా కోట్ల రూపాయాలకు సంబంధించిన డీల్స్ కావడంతో వాటిని తమ నమ్మకస్తులకు అప్పగించి ఎవరికెంత అనేది కూడా రేట్ ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.సెటిల్ మెంట్లు అన్నీ గుట్టు చప్పుడు కాకుండా రిసార్టులు,ఫామ్ హౌస్ లలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఆయా పోలీస్ స్టేషన్లలో నెలవారీ మామూళ్లు ఇవ్వని కిందిస్థాయి పోలీసు అధికారులను ముప్పు తిప్పలు పెట్టడం,వారిపై వేధింపులు,అవసరమైతే ఏదో ఒక కేసులో ఇరికించి ఇబ్బందులు పెట్టడం వంటివి చేస్తుంటారనే టాక్ వినిపిస్తోంది.అప్పటికీ మాట వినకపోతే ఉద్యోగులకు మెమోలు ఇవ్వడం, వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.






