- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగద్గిరిగుట్ట జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులు, వసతుల కొరత
జగద్గిరిగుట్ట జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులు, వసతుల కొరత విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

దిశ, మేడ్చల్ బ్యూరో : రాష్ట్ర రాజధాని సమీపంలోని ఓ ప్రముఖ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రణామాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. పేరుకే ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ, కనీస వసతులు, సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. 1000 మందికి పైగా పిల్లలు చదువుకునే ఈ విద్యా సంస్థలో సమస్యలు తాండవిస్తున్నా..అధికారుల నుంచి తగిన స్పందన కరువైంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట జడ్పీహెచ్‌ఎస్‌లో సరైన వసతులు, బోధన సిబ్బంది లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జడ్పీహెచ్‌ఎస్‌లో అస్తవ్యస్తత..
హైదరాబాద్ మహానగరంలోని జగద్గిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యావ్యవస్థ తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. పాఠశాలలో అడుగు పెడితే చాలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల చిట్టా కళ్ళ ముందు కనబడుతుంది. నిబంధనల ప్రకారం బోధనా సిబ్బంది సంఖ్య తగినంత ఉండాల్సి ఉండగా, కేవలం కొద్దిమంది ఉపాధ్యాయులతోనే పాఠశాలను నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు.
కొరవడిన బోధనా సిబ్బంది..
ప్రభుత్వ నిబంధనావళిని పరిశీలిస్తే, 1,130 మంది విద్యార్థులు ఉన్న ఈ విద్యా సంస్థలో కనీసం 40 మందికి పైగా బోధనా సిబ్బంది అవసరం. కానీ, ప్రస్తుతం కేవలం 28 మంది మాత్రమే విధుల్లో కొనసాగుతుండటం గమనార్హం. ముఖ్యంగా కీలకమైన సబ్జెక్టులైన బయాలజీ, సోషల్ స్టడీస్ బోధించాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయ్యి నెలలు గడుస్తున్నా, ఇంతవరకు ఆ స్థానాలను భర్తీ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఒక్క పీఈటీ మాత్రమే ఉండటంతో విద్యార్థులకు క్రీడా పాఠాలు భారంగా మారాయి.
మౌలిక వసతుల లేమితో..
పాఠశాలలో కేవలం బోధనా సిబ్బంది కొరత మాత్రమే కాకుండా, మౌలిక వసతుల లేమి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రాంగణంలోని బోర్‌వెల్ పూర్తిగా ఎండిపోవడంతో తాగునీటి కోసం విద్యార్థులు నానాపాట్లు పడుతున్నారు. కేవలం మంజీరా నీటి సరఫరాపైనే పూర్తిగా ఆధారపడాల్సి రావడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మరోవైపు విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, అందుకు తగినట్లుగా తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు కిక్కిరిసిన గదుల్లోనే చదువుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయడం తో పాటు, తాగునీరు, అదనపు గదుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.






