- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో కొలిక్కిరాని ఎన్నికలు
భద్రాద్రి పట్టణంలో వర్తకులకు సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగేలా లేవు.

దిశ, భద్రాచలం: భద్రాద్రి పట్టణంలో వర్తకులకు సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగేలా లేవు. చివరిసారిగా భద్రాద్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు 2016 మే 2 వ తేది ప్రమాణ స్వీకారం చేశారు. మూడు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఎన్నికలు 11వ సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీని ఎన్నుకునేందుకు 2024 జూలై లో పాత కమిటీని రద్దు చేసారు. ఎన్నికలు నిర్వహించేందుకు 12 మందితో అడహాక్ కమిటీ వేశారు. ఆడహాక్ కమిటీ కన్వీనర్ గా ప్రముఖ వ్యాపారస్తులు పరిమి సోమశేఖర్ ను నియమించారు. అంతకు ముందు భద్రాద్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో, మళ్లీ శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో ఆడహాక్ కమిటీ మరో రిజిస్ట్రేషన్ చేపించింది.
రిజిస్ట్రేషన్ కమిటీలో అధ్యక్షులుగా దేవి ప్రసాద్, కార్యదర్శిగా చారుగుళ్ల శ్రీనివాస్, కోశాధికారిగా బచ్చు శ్రీనివాస్ తో పాటు మరో నలుగురు సభ్యులు వివిధ పదవుల్లో ఉన్నారు. వాస్తవంగా ఆడహాక్ కమిటీ ఏర్పడిన తర్వాత 60 రోజుల్లో ఎన్నికలు జరపాలని జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించారు. 2024 ఆగస్టు లో బాధ్యతలు చేపట్టిన ఆడహాక్ కమిటీ 12 సార్లు సమావేశం నిర్వహించారు. చివరకు 2025 మార్చి 18న శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేపించారు. ఈ కమిటీలో ఉన్నవారు నూతన కమిటీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాల్సి ఉంది.
ఆడహాక్ కమిటీ ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా... ఇంతవరకు ఎన్నికల ఊసు లేకపోవడంతో భద్రాద్రి వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 17 అసోసియేషన్లు, 1064 సభ్యులు ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేడు అసోసియేషన్లు పెరగడంతో సభ్యుల సంఖ్య 1500 వరకూ పెరిగే అవకాశం ఉంది. శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిజిస్ట్రేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ భాద్యత ఆడహాక్ కమిటీ కన్వినర్ పరిమి సోమశేఖర్‌కు అప్పచెప్పాలని తీర్మానించారు. కాని కొంతమంది సభ్యులు కావాలని వ్యతిరేకించడంతో సోమశేఖర్ స్వచ్చందంగా తప్పుకున్నారు.
ఆయన తప్పుకోవడంతో మల్లికార్జునరావు కు ఎన్నికలు నిర్వహించే భాద్యతలు అప్పజెప్పారు. 500 మంది సభ్యులు సభ్యత్వ రుసుము చెల్లించినా... ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీలో నుంచి నలుగురు సభ్యులు స్వచ్చందంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఉన్న ఏడుగురిలో నలుగురు సభ్యులు తప్పుకోవడంతో, ఆ కమిటీ రద్దు అయినట్లే. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జునరావు సైతం చేతులు ఎత్తివేయడంతో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేవారు ఎవరు..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎందుకు నిర్వహించడం లేదు..?
ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు నిర్వహించ పోవడానికి కారణాలు... కర్ణుడి చావుకు ఉన్నన్ని ఉన్నాయి. పాత కమిటీ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ నిర్మించారు. ఈ బిల్డింగ్ నిర్మాణానికి భద్రాద్రి వ్యాపారుల వద్ద నుంచి చందాల రూపంగా వసూలు చేశారు. అయితే బిల్డింగ్ నిర్మాణానికి డొనేషన్స్ ఎంత వసూలు చేశారు..? నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారు..? అని కొందరు లెక్కలు అడుగుతున్నారు. అడహక్ కమిటీ ఆధ్వర్యంలో కొందరు సభ్యులు ఎవరిని సంప్రదించకుండానే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌కు నెలకు రు. 50 వేలకు అద్దెకు ఇచ్చారు. ఓల్డ్ ఏజ్ హోమ్ కొన్ని సాంకేతిక కారణాలతో ఎత్తివేయడంతో, ఇప్పుడు ఒక గర్ల్స్ హాస్టల్‌కు నెలకు రు. 20 వేలకు అద్దెకు ఇచ్చారు.
ఆడహాక్ కమిటీ ని కేవలం ఎన్నికల నిర్వహణకు మాత్రమే నియమించిందని, ఛాంబర్ ఆస్తులపై వారికి ఎటువంటి అధికారాలు లేవని, అటువంటి పరిస్థితుల్లో వారు ఛాంబర్ బిల్డింగ్ ను ఎవరికి తెలియకుండా ఎలా అద్దెకు ఇస్తారాని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే... ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించి, పాత కమిటీ లెక్కలతో పాటు, శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో రిజిస్టర్ అయిన సభ్యులు వ్యాపారులకు సమాధానం చెప్పాల్సి ఉంది. అప్పుడే కొత్త కమిటీ ఏర్పడే అవకాశం ఉంది. 300 మంది సభ్యులు ఉంటేనే ఎన్నికలు జరుపుతామని ప్రకటించిన ఒక పెద్ద మనిషి 500 మంది సభ్యులు డబ్బులు చెల్లించి సభ్యత్వం తీసుకున్నా.. ఎందుకు భాద్యతల నుంచి తప్పుకున్నాడో కూడా వ్యాపారులకు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఎన్నికలు జరపాలని నిరాహార దీక్ష
భద్రాచలంలో ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రముఖ వ్యాపారి ముక్తేశ్వరరావు ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి భద్రాద్రి వ్యాపారులతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారుల నుంచి మద్దతు లభించింది. ప్రముఖుల సూచన మేరకు ఆయన నిరాహార దీక్షను విరమించారు.
వ్యాపారాలతో చెలగాటం
సభ్యత్వాల పేరుతో, బిల్డింగ్ నిర్మాణం పేరుతో వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి, ఎన్నికలు జరపకుండా, కొంతమంది ఆడే డ్రామాలను వ్యాపారులు గ్రహిస్తున్నారు. వ్యాపారుల దగ్గర నుంచి వసూలు చేసిన ప్రతి పైసా కు లెక్కలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.






