- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాపై సైలెంట్ కిల్లర్స్ దాడి
సైలెంట్ కిల్లర్లుగా మారిన బీపీ (ఉధిక రక్తపోటు), షుగర్ (మధుమేహం) వ్యాధులు నారాయణపేట జిల్లాను తీవ్రంగా చుట్టుముడుతున్నాయి.

దిశ, ధన్వాడ: మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల సైలెంట్ కిల్లర్లుగా మారిన బీపీ (ఉధిక రక్తపోటు), షుగర్ (మధుమేహం) వ్యాధులు నారాయణపేట జిల్లాను తీవ్రంగా చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ వ్యాధులు.. నేడు పల్లెలు, గిరిజన తండాలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవయస్సులోనే ఇటు పురుషులు, అటు మహిళలు ఈ వ్యాధుల బారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 45,511 మంది బీపీ బాధితులు, 24,107 మంది షుగర్ రోగులు ఉన్నట్లు లెక్కలు చెబుతుండగా.. పరీక్షలు చేయించుకోని వారి సంఖ్య దీనికి రెట్టింపు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తీవ్ర పరిణామాల వైపు మధుమేహం, బీపీ!
సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, వాతావరణ మార్పులు, శారీరక శ్రమ తగ్గడం వ్యాధుల తీవ్రతకు ప్రధాన కారణాలుగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యాధులను సకాలంలో గుర్తించి అదుపు చేయకపోతే గుండెపోటు, మూత్రపిండాలు (కిడ్నీలు) దెబ్బతినడం, పక్షవాతం, దృష్టి లోపాలు వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా, డయాబెటిస్ నియంత్రణ విఫలమైతే అది నేరుగా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మార్కెట్ నిపుణుల ప్రకటనలు.. స్వయం వైద్యం ముప్పు!
అనారోగ్య భయంతో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడమే కాకుండా మార్కెట్లో దొరికే రకరకాల విటమిన్ మాత్రలు, ప్రత్యామ్నాయ మందులు వాడుతూ క్రమశిక్షణ లేని ప్రయోగాలు చేస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి స్వయం వైద్యం వాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో షుగర్ రోగుల పరిస్థితి ఇలా..
నారాయణపేట జిల్లాలో బీపీ షుగర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తుంది. కానీ నియంత్రణ మాత్రం జరగడం లేదు. దామరగిద్ద మండలంలో బీపీ రోగులు 5,103 మంది, షుగర్ రోగులు 2,333 మంది, ధన్వాడలో 2,509 మంది బీపీ రోగులు, 1,331 మంది షుగర్ రోగులు, గుండుమల్ లో 4,641 మంది బీపీ రోగాలు, 2,184 మంది షుగర్ రోగులు, మద్దూరులో 4,942 మంది బీపీ రోగులు, 2,299 మంది షుగర్ రోగులు, మాగనూరులో 2,974 మంది బీపీ రోగులు, 2,053 మంది షుగర్ రోగులు, మరికల్‌లో 4,844 మంది బీపీ రోగులు, 2,142 మంది షుగర్ రోగులు, ఉట్కూరు మండలంలో 1,230 మంది బీపీ రోగులు, 430 షుగర్ రోగులు ఉన్నారు. కర్నే పీహెచ్సీ పరిధిలో 4,844 బీపీ రోగులు, 2,142 మంది షుగర్ రోగులు, కోటకొండ పరిధిలో 3,726 మంది బీపీ రోగులు, 2,856 మంది షుగర్ రోగులు, పులిమామిడి పీహెచ్ఎసీ పరిధిలో 2,142 మంది బీపీ రోగులు, 1,0 29 మంది షుగర్ రోగులు, నారాయణపేట మండలంలో 4,030 మంది బీపీ రోగులు, 2,028 షుగర్ రోగులు,నర్వ మండలంలో 5,139 మంది బీపీ రోగులు, 2,852 మంది షుగర్ రోగులు ఉన్నారు.
అవగాహనా లోపమే ప్రధాన శత్రువు
జిల్లాలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్ నియంత్రణపై తగిన అవగాహన కార్యక్రమాలు లేకపోవడం, ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సరైన దిశానిర్దేశం లేకపోవడమే వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరగడానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి ప్రత్యేక వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించి నివారణా చర్యలు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.






