నిబంధనలకు తిలోదకాలు

by Yella Dhawani Reddy |

అధికార పార్టీ నాయకుడి అండతో అక్రమార్కులు రెచ్చుపోతున్నారు.

నిబంధనలకు తిలోదకాలు
X

దిశ, దుండిగల్ : అధికార పార్టీ నాయకుడి అండతో అక్రమార్కులు రెచ్చుపోతున్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లబ్దిదారునికి సమాచారం ఇవ్వకుండా ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ లో రోడ్డు విస్తరణ పనులు చేపడుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌరంపేట సర్వే నంబర్ 166/3 ప్రభుత్వ భూమిలోని 10 ఎకరాల భూమిని 1963‌లో ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకింద సత్యనారాయణ సింగ్ కు కేటాయించారు. అతడి తదనానంతరం ఆయన భార్య శకుంతలా దేవి పూర్తి హక్కుదారుగా ఉన్నారు. ఆ భూమిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆ కుటుంబానికి కనీస సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ వారికి సమాచారం ఇవ్వకుండానే సర్వే నిర్వహించి రోడ్డు విస్తరణ పనులు యథేచ్ఛగా కొనసాగిస్తుండడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం ఇవ్వకుండానే..

బౌరంపేట సర్వే నంబర్ 166/3 ప్రభుత్వ భూమిని 1963 లో రక్షణ శాఖ కోటాలో కింద 10 ఎకరాలు ఎక్స్ సర్వీస్ మెన్ కు కేటాయించారు. రక్షణ శాఖకు కేటాయించిన భూమి రెవెన్యూ అధికారుల పరిధిలో ఉండదు. దానికి పూర్తి హక్కుదారుడు ఎక్స్ సర్వీస్ మెన్ అవుతారు. అయితే ఆయనకు లేదా కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారుల తీరు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అధికార పార్టీ నాయకుడి అండతో..

సీఎం‌కు అత్యంత సన్నిహితుడినని అని చెప్పుకునే స్థానిక కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఈ రోడ్డు నిర్మాణ పనులకు అండగా ఉండటంతో జేఎన్ఎస్,రుద్రా నిర్మాణ సంస్థల యజమానులు ధైర్యంగా ముందుకెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు నిర్మాణదారులు యథేచ్ఛగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగిస్తున్న కాసులకు కక్కుర్తి పడుతున్న సంబంధిత అధికారులు ప్రభుత్వ భూమిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడం లేదంటూ విమర్శలు ఉన్నాయి. పలు పత్రికలు పతాక శీర్షికన వార్తలు ప్రచురిస్తున్నా.. అధికారులు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది,

ఫిర్యాదు చేశాం.. పట్టించుకోవడం లేదు

ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ లో సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. దీనిపై ఈ నెల 14న దుండిగల్ మున్సిపల్ కమిషనర్, దుండిగల్ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశాం. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మా భూమిని వదిలే ప్రశక్తే లేదు. త్వరలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాను.

- శేషి కిరణ్ రెడ్డి

విచారణ కొనసాగుతుంది : ఆర్డీవో

బౌరంపేట ప్రభుత్వ భూమిలో వేస్తున్న రోడ్డు విస్తరణ పనులపై మల్కాజిగిరి ఆర్డీఓ శ్యాం ప్రకాష్ ను ‘దిశ’ ప్రతినిధి వివరణ కోరగా.. విచారణలో 19 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా ఆయినట్లు గుర్తించామన్నారు. పూర్తి విచారణ చేపట్టి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story