- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'దిశ' కథనానికి స్పందన.. సీజ్ చేసిన భవనంలో అడ్మిషన్ల దందాకు చెక్
'బయట సీల్.. లోపల డీల్' అన్నట్లుగా సాగుతున్న అక్రమ నిర్మాణాల దందాపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు.

దిశ, పేట్ బషీరాబాద్ : 'బయట సీల్.. లోపల డీల్' అన్నట్లుగా సాగుతున్న అక్రమ నిర్మాణాల దందాపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. సీజ్ చేసిన భవనంలో ఏకంగా కళాశాల నడిపేందుకు, విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్న వ్యవహారంపై ఈ నెల 26న (ఆదివారం) 'దిశ' దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు స్పందించారు. వాస్తవాలను వెలుగులోకి తెస్తూ 'దిశ' ప్రచురించిన కథనంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝుళిపించారు. సదరు అక్రమ భవనానికి ఉన్న కళాశాల బోర్డును తొలగించి, భవనాన్ని తిరిగి పకడ్బందీగా సీజ్ చేశారు.
'దిశ' కథనంతో కదలిక..
దుండిగల్ సర్కిల్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగించిన విషయం తెలిసిందే. ఒకవైపు అధికారులు నామమాత్రంగా సీజ్ చేసినట్లు చూపిస్తుండగానే, మరోవైపు లోపల పనులు పూర్తి చేసి ఏకంగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే అక్రమంగా నిర్మించిన ఓ భవనం సీజ్ అయిన విద్యాసంస్థ ('ఆదర్శ్ ఫిజిక్స్ అకాడమీ') పేరిట బోర్డులు పెట్టి, అడ్మిషన్లు సైతం తీసుకోవడం మొదలుపెట్టారు. "సీజ్ చేసినా లెక్కలేదు" అంటూ ఏప్రిల్ 26 నాడు 'దిశ' దినపత్రిక ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది.
బోర్డుల తొలగింపు.. మళ్లీ సీజ్
ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినా పెద్దగా స్పందించని అధికారులు.. తాజా 'దిశ' పత్రికా కథనంతో స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కదిలిన క్షేత్రస్థాయి సిబ్బంది హుటాహుటిన సదరు అక్రమ భవనం వద్దకు చేరుకున్నారు. భవనానికి ఏర్పాటు చేసిన కళాశాల బోర్డులను, ఫ్లెక్సీలను తొలగించారు. లోపల జరుగుతున్న ప్రక్రియలను నిలిపివేసి, భవనంలోకి ఎవరూ ప్రవేశించకుండా తిరిగి పకడ్బందీగా సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి భవనాన్ని వినియోగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మిగతా వాటిపైన దృష్టి పెట్టాలి
అధికారుల తాజా చర్యలపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుండిగల్, కొంపల్లి సర్కిళ్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా.. రాత్రికి రాత్రే పూర్తవుతున్న ఇతర అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై కూడా జోనల్ స్థాయి అధికారులు ఇలాగే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






