- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమ్మేసిన కాలుష్యం.. ప్రమాణాలు గాలికొదిలిన టీఎఫ్ఎల్ క్విన్ ఇండియా కంపెనీ!
బాచుపల్లి, సాయి అనురాగ్ కాలనీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిశ్రమ యాజమాన్యం ఇష్టారీతిన నిర్వహణ చేపట్టడమే స్థానికులకు శాపంగా మారింది.

దిశ, మేడ్చల్ బ్యూరో: బాచుపల్లి, సాయి అనురాగ్ కాలనీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిశ్రమ యాజమాన్యం ఇష్టారీతిన నిర్వహణ చేపట్టడమే స్థానికులకు శాపంగా మారింది. పరిశ్రమ వ్యర్థాలు, పొగతో కాలుష్యాన్ని నింపుతున్నారు. ఫలితంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండగా, పర్యావరణం కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకరంగా పరిశ్రమ వ్యర్థాలు, పొగ..
మేడ్చల్ జిల్లా, బాచుపల్లి మండలం, సాయిఅనురాగ్ కాలనీ సమీపంలో ‘టీఎఫ్‌ఎల్ క్విన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట పరిశ్రమ నిర్వహిస్తో్ంది. అయితే ఈ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను నియంత్రించి, వాటిని తగు విధంగా భద్రపరచాలి. కాలుష్యాలు గాలిలో, నేల మీద విడుదల చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. కానీ ఇక్కడ పరిశ్రమ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పరిశ్రమకు సంబంధించిన విష వాయువులు, వ్యర్థ పదార్థాలు విచ్చలవిడిగా వెదజల్లుతుండడంతో రోగాల భారిన పడటమే కాకుండా ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నామని అక్కడ పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణంలోకి రసాయనాలు విడుదల చేస్తూ, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారబోయడం, కాలువలలో వదలడం వంటివి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు కాలుష్యం వెదజల్లకుండా పెద్ద గొట్టాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఫిల్టర్ చేయాలి, నేరుగా గాలిలోకి వదల కూడదు. కానీ బాచుపల్లి, సాయిఅనురాగ్ కాలనీలో నేరుగా పొగను గాలిలోకి వదిలేస్తున్నారు. దీంతో దట్టమైన పొగ చుట్టుపక్కల పరిసరాలు కనిపించనంతగా కమ్మేస్తుంది. దీంతో పాటు భరించలేని దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఆ కాలనీకి వెళ్లేవారు పట్టుమని పది నిమిషాలైనా ఉండలేరంటే ఎంత దుర్వాసన వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉపాధి కోసం తప్పనిసరి పనిచేసే కార్మికుల పరిస్థితి వర్ణణాతీతం. కనీస అససరాలైన మాస్కు, హెల్మెట్, గ్లౌజు, బూట్లు అందించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ల్యాబ్ టెస్టులు తప్పనిసరి..
పరిశ్రమలో తప్పనిసరిగా ప్రతి మూడు నెలలకొకసారి పరీక్షలు చేయించి, సంబంధిత అధికారుల నుంచి ధ్రువ పత్రాలు జారీ అయితే కానీ పరిశ్రమలను నిర్వహించరాదు. అయితే ‘టీఎఫ్‌ఎల్ క్విన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ అలాంటి అనుమతులు పొందడంలేదని తెలుస్తోంది. పొంది ఉంటే సంబంధిత ల్యాబ్‌ల నుంచి ధ్రువ పత్రాలు పొందాల్సి ఉంటుంది. అటువంటి సర్టిఫికెట్‌లు ఈ పరిశ్రమలోనూ లేవని సమాచారం. పరిశ్రమ తీరుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక ఆహ్వనితులు, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్‌చార్జి కొలాన్ హన్మంతరెడ్డి, రాష్ట్రపతి కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శిలతో సహా కాలనీవాసులు హన్మంతరావు, కే.నారాయణ గౌడ్, ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖ సైతం కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక మున్సిపల్ యంత్రాంగానికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి ఏడాది కాలంగా టీఎఫ్ఎల్ క్విన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రమాణాలు పాటించాలని హెచ్చరిస్తూ మూడుసార్లు నోటీసులు జారీ చేసింది. అయినా పీసీబీ అదేశాలను సైతం కంపెనీ బేఖాతరు చేస్తోంది. ఇప్పటికి విచ్చలవిడిగా గాలిలో కాలుష్యాన్ని పంపుతోందని, దీంతో పరిసర ప్రాంతాలు విషపూరితమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొరవడిన నియంత్రణ..
టీఎఫ్ఎల్ క్విన్ ఇండియా కంపెనీ విషవాయువులు వెలువరిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్యామ్యాలకు అలవాటుపడి చేతులు తడుముకొని వెళ్లుపోతున్నారనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు, కార్మిక, మున్సిపల్ శాఖల అధికారులు తరచూ తనిఖీలు చేపట్టి ఎప్పటికప్పుడు కట్టడి చేపడితే కాలుష్యా్న్ని నియంత్రించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ సంబంధిత అధికారులు అటుగా వెళ్లినా పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రాణాలను హరిస్తోంది..
- హన్మంతరావు, సాయిఅనురాగ్ కాలనీవాసి
టీఎఫ్‌ఎల్ క్వీన్ ఇండియా పరిశ్రమ చట్టాలను ఉల్లంఘిస్తోంది. విచ్చలవిడిగా గాలిలో కాలుష్యాన్ని వెదజల్లుతోంది. పరిశ్రమ నుంచి సాయిఅనురాగ్ కాలనీ మీదుగా వెళ్లే మురుగు కాలువలో పరిశ్రమ వ్యర్థాలను వదులుతున్నారు. దీంతో దుర్గంధం వేదజల్లుతోంది, కాలనీవాసులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు. కొత్తవారు కాలనీకి వస్తే పరిశ్రమ నుంచి వస్తున్న దుర్వాసన, పొగతో వేగలేకపోతున్నారు.






