నిబంధనలకు పాతర.. అక్రమ నిర్మాణాలకు అధికారుల భరోసా

by Naga Rani Yarlagadda |

కీసర సర్కిల్‌లో అక్రమ నిర్మాణాల జోరు అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలకు పాతర.. అక్రమ నిర్మాణాలకు అధికారుల భరోసా
X

దిశ, దమ్మాయిగూడ : కీసర సర్కిల్‌లో అక్రమ నిర్మాణాల జోరు అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీసర, దమ్మాయిగూడ డివిజన్ల పరిధిలో అనుమతులు లేని నిర్మాణాలు, అదనపు అంతస్తులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా, సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్మాయిగూడ డివిజన్ బండ్లగూడలో ఓ అక్రమ నిర్మాణం అధికారుల పనితీరుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణంపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవటం శోచనీయం. ఇది అధికారుల అవినీతికి, అక్రమార్కులతో కుమ్మక్కైన తీరుకు అద్దం పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

అదేవిధంగా చీర్యాలలో నిబంధనలు అనేవే కనిపించడం లేదని, ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులతో చైన్మెన్లు కుమ్మక్కకై అన్నీ తామై నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ కొరవడటంతో కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిర్మాణదారుల నుంచి భారీగా మామూళ్లు దండుకుంటూ అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్నారని, అందుకే ఫిర్యాదులు వెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story