మేడ్చల్ బీఆర్ఎస్‌లో బయటపడిన అసమ్మతి

by Disha Web Desk 18 |
మేడ్చల్ బీఆర్ఎస్‌లో బయటపడిన అసమ్మతి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: జాతీయ రాజకీయాలు లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకువెళ్లుతున్న వేళ.. మేడ్చల్ జిల్లా పార్టీలో అసమ్మతి జ్వాలాలు చల్లారడంలేదు. గ్రూపు తగాదాలు, అసమ్మతితో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు ఏకతాటిపై వచ్చి ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆత్మీయ సమ్మేళనాలతో నేతల మధ్య ఆత్మీయత వెల్లివిరియడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి మల్లారెడ్డి ఇలాక మేడ్చల్ నియోజకవర్గంలోని ఆలియాబాద్ సీఎంఆర్ కన్వెన్షన్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అసమ్మతి బయటపడింది. పలువురు ప్రజాప్రతినిధులు తమకు సరైన గౌరవం ఇవ్వడంలేదని, ఉద్యమ కారులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం కౌన్సిలర్ సాయిరెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ వీ కో అర్డినేటర్ చాప భాస్కర్ లు తమ అసంతృప్త గాలాన్ని వినిపించారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, అవమానం, అణచివేత ధోరణి కొనసాగుతుందని, సరైన ప్రాధాన్యత ఇవ్వడలేదని వాపోయారు. కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పల్లా కృషి ఫలించేనా..

ఆత్మీయ సమ్మేళనాలను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ అధిష్టానం నియమించింది. ఇటీవల పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు, శాసన మండలి విఫ్ శంభీపూర్ రాజులు కూడా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దుండిగల్ లోని జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే దానిపైన దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీలో ఐక్యత సాధించాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... కీలక సమావేశానికి ఉప్పల్, కూకట్ పల్లి ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, మాధవరం క్రిష్ణారావులతోపాటు ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రా రెడ్డి లాంటి కీలక ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ లో నెలకొన్న గ్రూపు తగాదాలు, అసమ్మతి నేతల వ్యవహారం చూస్తుంటే సఖ్యత సాధించడం సాధ్యమయ్యే పనేనా! అన్న సందేహాలు క్యాడర్‌లో వ్యక్తమవుతున్నాయి.

మూడు సెగ్మెంట్లలో అసమ్మతి రాగం..

మేడ్చల్ జిల్లాలో ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ ఐదు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. మరో రెండు ఎల్బీనగర్, శేరిలింగంపల్లి రెండు సెగ్మెంట్లలో కొంత పార్ట్ కలుస్తాయి. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు గ్రూపులుగా విడిపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా రాజకీయాలు నడుపుతున్నారు. కీలక పదవులలో ఉన్న నేతలు పార్టీని, అధికారులను గుప్పిట్లో పెట్టుకుని తమ వ్యతిరేకుల ఆటలు సాగకుండా చూస్తున్నారు. నియోజకవర్గంలో తాము చెప్పిందే వేదం అన్న విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వేర్వేరు వర్గాలుగా పనిచేస్తున్నారు. ఉప్పల్ లో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ల మధ్య సఖ్యత లేదు. మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నియోజకవర్గాలలో కీలక పదవులలో ఉన్న నేతల మధ్య ఏళ్ల తరబడిగా సఖ్యత లేదు. ఒకరంటే ఒకరికి పడదు. ఎక్కడైనా ఎదురుపడినా ఎడమొహం, పెడమొహంగా వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఎవరి వర్గంలో వారు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో క్యాడర్‌ ఉన్నది. చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయారు.

కూకట్ పల్లిలో..

టీఆర్‌ఎస్‌ పార్టీ (ఇప్పుడు బీఆర్‌ఎస్‌) అధికారంలోకి వచ్చిన తర్వాత ఉనికిని కోల్పోయిన ఇతర పార్టీలు మనుగడ సాగించడం కష్టంగా మారింది. కూకట్ పల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవరం క్రిష్ణారావుతో సహా ఇతర పార్టీలకు చెందిన పెద్దఎత్తున క్యాడర్‌ కలిగినవారు బీఆర్‌ఎస్‌లో చేరారు. కూకట్ పల్లిలో కిందిస్థాయిలో బీఆర్‌ఎస్ కు తప్ప మరో పార్టీకి బలమైన క్యాడర్‌ లేకుండాపోయింది. అయితే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్య నేతలకు పదవులు, కాంట్రాక్టులు ఇచ్చి గౌరవించిన బీఆర్‌ఎస్‌ నేతలు ఉద్యమ కాలం నుంచి పార్టీలో కొనసాగుతున్నవారికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావు, అతని తండ్రి ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కు అన్ని రకాలుగా సహకరించి వెన్నంటే నడిచారు. అప్పట్లో ఉద్యమ కారులు పడ్డ బాధలన్నీ నవీన్ రావు అతని కుటుంబ సభ్యులకు తెలిసినప్పటికీ, కింది స్థాయి క్యాడర్ కష్టాలను గుర్తించలేదని వాపోతున్నారు.

మల్కాజిగిరిలోనూ అదే తంతు..

మల్కాజిగిరి నియోజకవర్గంలో రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు చింతల కనకారెడ్డి, మైనంపల్లి హన్మంతరావులను నిలబెట్టిన అభ్యర్థులను పార్టీ శ్రేణులు గెలిపించారు. ఇక్కడ మైనంపల్లియే తిరుగులేని నేతగా చలామాణి అవుతున్నారు. గతంలో ఉద్యమంలో చురుకుగా ఉన్న బద్దం పరశురాంరెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్లు సెలెంట్ అయ్యారు. అయితే జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఎన్నికల టికెట్లు, నామినేటెడ్‌ పదవులు, చివరకు పార్టీ పదవులలో కూడా పాతకాపులకు అవకాశం దక్కలేదన్న అపవాదును పార్టీ మోస్తుంది. బీఆర్‌ఎస్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చే విధంగా కష్టపడిన కార్యకర్తలకు కూడా పార్టీలో గుర్తింపు లేదన్న బలమైన వాదన వినిపిస్తుంది. ఈ క్రమంలో పార్టీలోని ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నేతల మధ్య సఖ్యత కొరవడి గ్రూపు తగాదాలకు అజ్యం పోస్తున్నట్లు సమాచారం. అందుబాటులో ఉంటూ ఆపదలో ఆదుకునే వారి వైపు ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్‌ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జిల్లాలో కీలక నేతల మధ్య సయోధ్య లేకపోవడం పార్టీ క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తుంది. ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక బీఆర్‌ఎస్‌ శ్రేణులు సతమతమవుతున్నారు. మిగితా చోట్ల ఉద్యమకారులు, ముందు నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని పట్టించుకోవడంలేన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్ని సమస్యల మధ్యన బీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు ఏ మేరకు విజయవంతమవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story