- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో స్టాంప్స్..! సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జ్యుడీషియల్ స్టాంపుల కొరత
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జ్యుడీషియల్ స్టాంపుల కొరత ఏర్పడింది.

దిశ, మేడ్చల్ బ్యూరో : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జ్యుడీషియల్ స్టాంపుల కొరత ఏర్పడింది. గురువారం బోయిన్‌పల్లికి చెందిన సూర్య ఓపెన్ ఫ్లాట్ అగ్రిమెంట్ నిమిత్తం జ్యుడిషియల్ స్టాంపుల కోసం సెంటర్ పాయింట్‌లోని మారేడ్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. స్టాంపుల విక్రయ కౌంటర్‌లో స్టాంపులు కావాలని అడుగగా సిబ్బంది లేవని సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో సూర్య సబ్ రిజిస్ట్రార్ చాంద్ పాషాను సంప్రదించగా స్టాంపుల విక్రయ కౌంటర్‌లో పనిచేసే ఉద్యోగి ఈ రోజు రాలేదని, అందువల్లనే పక్కనే ఉన్న బోయిన్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారన్నారు. అక్కడి నుంచి సూర్య పక్కనే ఉన్న బోయిన్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, స్టాంపుల కోసం అడిగితే సర్వర్ డౌన్ ఉందని, స్టాంపులు ఇవ్వలేమని కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ సాధిక్ అలీ తెలిపారన్నారు. ఈ రెండు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జ్యుడీషియల్ స్టాంపులు దొరకకపోవడంతో బయట ఉన్న ప్రైవేట్ స్టాంప్ వెండర్ వద్ద రెట్టింపు ధర చెల్లించి స్టాంపులు కొనుగోలు చేసినట్లు సూర్య తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే పరిస్థతి నెలకొందని స్టాంపు విక్రయదారులు చెబుతున్నారు.
కృత్రిమ కొరత.. అధిక ధర..
అసలే రియల్‌ఎస్టేట్ రంగం కునారిల్లుతోంది. రిజిస్ట్రేషన్లు అంతంత మాత్రంగానే ఉన్నందున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. దీనికి తోడు ఆయా కార్యాలయాల్లో స్టాంపుల కొరతతో విక్రయదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సాధారణంగా చర, స్తిరాస్తుల రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు చేయించేందుకు నాన్ జ్యుడిషియల్ స్టాంపులు తప్పని సరి. స్టాంపుల కోసం రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లితే సర్వర్ డౌన్ అని.. స్టాంపుల విక్రయించే ఉద్యోగి విధులకు రాలేదని, రకరకాల కారణాలతో స్టాంపు విక్రయదారులను ముప్పు తిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్లు చేసుకొనే క్రయ, విక్రయదారులు స్టాంపుల కోసం బయటి ప్రాంతాల్లోని ప్రైవేట్ లైసెన్సుదారులను ఆశ్రయించాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాంపుల విక్రయదారుల డిమాండును దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ లైసెన్సు స్టాంప్ వెండర్లు అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. రూ.20ల స్టాంప్ పేపర్‌కు అదనంగా రూ.10, రూ.50ల స్టాంప్ పేపర్‌కు అదనంగా రూ.20, రూ.100ల స్టాంప్ పేపర్‌కు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
దోపిడీ వ్యూహమా..?
జ్యుడిషయల్ స్టాంపుల విషయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులే కుంభకోణానికి తెరలేపారా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కృత్రిమ కొరత సృష్టించి, అదనపు డబ్బు వసూలు చేసే ఉద్దేశంతో ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సాధారణ అవసరాల కోసం ప్రజలు రూ.10, రూ.20, స్టాంపులను కొనుగోలు చేస్తుంటారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం అయితే రూ.50, రూ.100 స్టాంపులను కొంటుంటారు. ప్రస్తుతం స్టాంపుల విక్రయాలపై సబ్ రిజిస్ట్రార్లు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో ప్రైవేట్ లెసెన్సు వెండర్లు ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని మెజారిటీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.






