- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటళ్లకు ఎంఎంసీ కమిషనర్ అల్టిమేటం
ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా హోటళ్లలో మిగిలిన ఆహార వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారవేయడం లేదా పశువుల, పందుల ఫార్మ్‌లకు తరలిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే హోటళ్లను సీజ్ చేస్తామని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు.

దిశ,ఉప్పల్: ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా హోటళ్లలో మిగిలిన ఆహార వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారవేయడం లేదా పశువుల, పందుల ఫార్మ్‌లకు తరలిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే హోటళ్లను సీజ్ చేస్తామని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. హబ్సిగూడ చౌరస్తాలోని సుప్రభాత్, అమరావతి హోటళ్లలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కిచెన్‌లను పరిశీలించిన సందర్భంగా మిగిలిన ఆహార వ్యర్థాలను పశువుల, పందుల ఫార్మ్‌లకు అందిస్తున్నట్లు సిబ్బంది వెల్లడించారు. అనంతరం సమీపంలోని పశువుల ఫార్మ్‌ను పరిశీలించిన కమిషనర్, హోటళ్ల నుంచి తీసుకొచ్చిన ఆహార వ్యర్ధాలను బహిరంగంగా నిల్వ ఉంచి పశువులకు వేస్తున్నట్లు గుర్తించారు. ఈ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్, ఇలాంటి చర్యలు దుర్వాసన, కాలుష్యం, వ్యాధుల వ్యాప్తికి దారితీసి ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయని అన్నారు. నగరంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి ఆహార వ్యర్థాల నిర్వహణ కోసం తప్పనిసరిగా ఇన్-సిటు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని లేదా అధీకృత వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలకు మాత్రమే పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఆహార వ్యర్ధాలను అనధికారికంగా పారవేయడం లేదా పశువుల, పందుల ఫార్మ్‌లకు తరలించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసిన కమిషనర్, నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలతో పాటు అవసరమైతే సీజ్ కూడా చేస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణ, పరిశుభ్రమైన నగర నిర్మాణం, శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో అన్ని వాణిజ్య సంస్థలు తమ సామాజిక బాధ్యతను గుర్తించి నిబంధనలను కచ్చితంగా పాటించాలని కమిషనర్ సూచించారు.






