సార్ ఫామ్ నింపి వచ్చేసరికి ఇంట్లో చోరీ..!

by Ratna Kumari |

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ఫారం నింపేందుకు వెళ్లి తిరిగి వచ్చేలోపే ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.

సార్ ఫామ్ నింపి వచ్చేసరికి ఇంట్లో చోరీ..!
X

దిశ, బైంసా : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ఫారం నింపేందుకు వెళ్లి తిరిగి వచ్చేలోపే ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. అదే భవనంలోని మరో ఇంటిలోనూ చోరీ జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బైంసా పట్టణంలోని జీపీ లడ్డా కళాశాల ప్రాంగణంలోని పాలేవార్ దత్తాత్రి నివాసంలో మధ్యాహ్నం సమయంలో దొంగలు చొరబడ్డారు. దత్తాత్రి ఎస్‌ఐఆర్ ఫారం నింపేందుకు తానూరు మండలంలోని ఎల్వి గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దుండగులు ఇంట్లోని రూ.28 వేల నగదు, సుమారు 10 తులాల వెండి ఆభరణాలను అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదే భవనం రెండో అంతస్తులో నివసిస్తున్న తోలాజీ రాకేష్ ఇంట్లో కూడా దొంగలు చొరబడి కొంత నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఏఎస్పీ సాయి కిరణ్, సీఐ సాయి కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story