‘ప్రభుత్వంపై యువతకు నమ్మకం పోయింది’ యువ సంగ్రామ సదస్సుకు తలసాని పిలుపు

by Ramesh Naini |

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఒత్తిడి తెస్తామని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్ హెచ్చరించారు.

‘ప్రభుత్వంపై యువతకు నమ్మకం పోయింది’ యువ సంగ్రామ సదస్సుకు తలసాని పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఒత్తిడి తెస్తామని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్ (Talasani Srinivas Yadav) హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా యువతకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. బుధవారం సరూర్‌నగర్ స్టేడియంలో ఈ నెల18న నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సు ఏర్పాట్లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ముఠాగోపాల్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, పలువురు సీనియర్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు.

2023 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల నియామకాలు చేపడతామని, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉద్యోగాల కోసం యువత ఆందోళనలు చేపడితే అక్రమంగా అరెస్ట్‌లు చేయడం, లాఠీచార్జి చేయడం వంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై యువతకు నమ్మకం పోయిందని అన్నారు. సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, యువత పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Next Story