నిరుపేదలకు అందాల్సిన ఇళ్లను అనుచరులకు, అనర్హులకు అందజేస్తే ఊరుకోం: ఎమ్మెల్యే

by Kodari Anjali |

బీఆర్ఎస్ హయాంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను కాంగ్రెస్ మంత్రుల అనుచరులు, ఐఏఎస్ అధికారులు చెప్పిన వారికి ఇస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు.

నిరుపేదలకు అందాల్సిన ఇళ్లను అనుచరులకు, అనర్హులకు అందజేస్తే ఊరుకోం: ఎమ్మెల్యే
X

దిశ, కూకట్ పల్లి: బీఆర్ఎస్ హయాంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను కాంగ్రెస్ మంత్రుల అనుచరులు, ఐఏఎస్ అధికారులు చెప్పిన వారికి ఇస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. క్యాంప్ కార్యాలయంలో ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, కూకట్ పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హులకు, మంత్రుల అనుచరులు, ఐఏఎస్ అధికారుల అన్యాయాలకు అందజేస్తున్నారని అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉంటున్న పేద ప్రజలకు అందాల్సిన ఇళ్లను అనుచరులకు ఇవ్వడం ఎందని ప్రశ్నించారు. కూకట్ పల్లి నియోజకవర్గం పరిధి కైత్లాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి, కుత్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు అధికారికంగా కేటాయించారని ఆరోపించారు. కూకట్ పల్లిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లు కూకట్ పల్లి వాళ్ళకే కేటాయించాలి, బయటి వాళ్లకు కేటాయిస్తే ఊరుకోమని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా పేద వారికి కేటాయిస్తే ఎటువంటి అభ్యంతరం లేదని, కైత్లపూర్ గ్రామానికి చెందిన వారికి, పేద జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.

Next Story