రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారా?

by Naga Rani Yarlagadda |

రేషన్ కార్డులకు సంబంధించిన ఈ-కేవైసీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారా?
X

దిశ, మేడ్చల్ బ్యూరో : రేషన్ కార్డులకు సంబంధించిన ఈ-కేవైసీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కేంద్రం ఇటీవల రేషన్ కార్డు హోల్డర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎవరైనా ఈ-కేవైసీని పూర్తి చేయకపోతే వారి కార్డు రద్దయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. కాగా ఈ-కేవైసీ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడగించింది. అయినా మేడ్చల్ జిల్లాలో ఇప్పటికీ 30 శాతం కార్డు హోల్డర్లు ఈ-కేవైసీ చేసుకోకపోవడం గమనార్హం.

5.46 లక్షల మంది ఈ-కేవైసీకి దూరం..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 636 చౌకదరల దుకాణాలుండగా, 5లక్షల37వేల 810 రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డులలో 18,65,353 మంది లబ్దిదారులున్నారు. అయితే ఇప్పటికి మొత్తం లబ్దిదారుల్లో 70.72 శాతం, అనగా 13,19,111 లబ్దిదారులు మాత్రమే ఈ-కేవైసీ చేసుకున్నారు. మిగితా 5,46,242 మంది లబ్దిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది.

3 నెలల రేషన్ ముందుగానే..

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 3 నెలల రేషన్‌ను ముందుగానే పంపిణీ చేసింది. దీంతో ఆగస్టు వరకు రేషన్ కోసం షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమయానికే కార్డు ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచిస్తోంది. లేదంటే సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు తప్పవు. ఈ చర్యల వెనుక ప్రధాన కారణం నకిలీ కార్డులు. చనిపోయిన లబ్దిదారుల పేర్లను కొనసాగించడం వంటి మోసాలను అడ్డుకోవడం, రేషన్ పంపిణీ విధానాన్ని పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది.

తప్పనిసరిగా చేసుకోవాలి..

- శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి

జిల్లాలో మిగిలిన 5,46,242 మంది రేషన్ కార్డులు కలిగిన లబ్దిదారులు సెప్టెంబర్‌లోపు ఈ-కేవేసీ చేసుకోవాలి. 5 సంవత్సరాల వయస్సు పూర్తి అయిన వారందరు తప్పకుండా చేసుకోవాలి. కార్డు హోల్డర్లు తమ సమీపంలో ఉన్న రేషన్ షాపుకు వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. 5ఏళ్ల లోపు పిల్లలకు ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. రేషన్ షాపుల డీలర్లు సైతం రేషన్ షాపులను తెరిచి ఉంచి, ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు సహరించాలి.

Next Story