- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆస్తి కోసం మాస్టర్ ప్లాన్.. చివరికి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట

దిశ, ఘట్కేసర్ : ఆస్తి కోసం బావమరిది హత్యకు సొంత చెల్లి, బావ కుట్ర చేశారు. అందుకోసం రెక్కీ నిర్వహిస్తున్న మైనర్ బాలురు పట్టుబడిన సంఘటన రాచకొండ కమిషనరేట్, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ లో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. అంకుషాపూర్ చెందిన ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగి పెంటయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు మాజీ ఉపసర్పంచ్ బోనాల రాజశేఖర్, చిన్న కుమారుడు బోనాల ఈశ్వర్. 2009లో కుమార్తె లావణ్యను గచ్చిబౌలి మసీద్ బండకు చెందిన శ్రీనివాస్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.12 లక్షల నగదు, ఎకరం పొలం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెంటయ్య ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వచ్చిన డబ్బులో వాటా కావాలని శ్రీనివాస్, లావణ్యలు గొడవ పడ్డారు. దీంతో కుటుంబ సభ్యుల పైన దాడి చేస్తుండగా వారి పైన బావమరిది ఈశ్వర్ ఎదురు తిరిగాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు తీవ్రమయ్యాయి.
అప్పటి నుంచి బావమరుదులపై శ్రీనివాస్ కక్షపెంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం పెంటయ్య భార్య అంకుషాపూర్ సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కుమార్తె లావణ్య తండ్రి, అన్నలపై సికింద్రాబాద్ లో పోలీస్ కేసు పెట్టిందని, ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని బాధితులు తెలిపారు. ఎలాగైనా తమ ఆస్తి(3 ఎకరాలు)ని లాక్కోవాలని బావ శ్రీనివాస్ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. అంకుషాపూర్ లో బుధవారం ఉదయం బోనాల ఈశ్వర్ కదలికలపై మైనర్ బాలురు రెండు బృందాలుగా విడిపోయి, అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అంకుషాపూర్ కు చెందిన చిరంజీవి (నగరంలో పోలీస్ కానిస్టేబుల్) అనే వ్యక్తి పట్టుకున్నారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళని అప్రమత్తం చేసి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలుర వద్ద ఉన్న సెల్ ఫోన్ లో బోనాల ఈశ్వర్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వారు గుర్తించారు.
కన్నడ రాష్ట్రానికి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తితో శ్రీనివాస్ రూ.15 లక్షల సుఫారి ఒప్పందం కుదుర్చుకొని అంకుషాపూర్ లోని ఇంటి నెంబరు, కారు నెంబరు, లొకేషన్ మ్యాప్, బోనాల ఈశ్వర్ ఫోటోను అందజేశాడని మైనర్ బాలురు తెలిపాడు. సుఫారి తీసుకున్న ఆసిఫ్ తమకు అంకుషాపూర్లో రెక్కీ నిర్వహించేందుకు రూ.15వేలకు ఒప్పందం కుదుర్చుకొని రూ.3 వేలు అడ్వాన్స్ చెల్లించాడన్నారు. ఈశ్వర్ దినచర్యలను పరిశీలించి తాము సమాచారం ఇచ్చేందుకు నెల రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నామని చెప్పడంతో..ఒక్కసారిగా స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే ఘట్కేసర్ పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు మైనర్ బాలురను అదుపులో తీసుకొని కేసు విచారణ చేస్తున్నారు.