- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీ ఆఫీసు వెనుకే అక్రమ భారీ కన్వెన్షన్ సెంటర్…
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన క్షేత్రస్థాయి అధికారులు, అక్రమార్కులకే వంత పాడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

దిశ, పేట్ బషీరాబాద్: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన క్షేత్రస్థాయి అధికారులు, అక్రమార్కులకే వంత పాడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, వెంటనే సీజ్ చేయాలని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా జీడిమెట్ల సర్కిల్-55 డిప్యూటీ కమిషనర్ (డీసీ) వాటిని బేఖాతరు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణం అని కళ్లెదుటే కనిపిస్తున్నా.. వెంటనే సీజ్ చేసి చర్యలు తీసుకోకుండా నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లు, హియరింగ్ (విచారణ)ల పేరుతో కాలయాపన చేస్తూ అక్రమార్కులపై డీసీ 'అవ్యాజమైన ప్రేమ'ను చాటుకుంటున్నారు అంటూ పలువురు స్థానికులు విమర్శిస్తున్నారు.
కోర్టు ఆదేశాలు బేఖాతరు..
అక్రమ నిర్మాణాల వ్యవహారంలో మున్సిపల్ అధికారుల తీరును తప్పుబడుతూ 2025 ఏప్రిల్ 29న హైకోర్టు స్పష్టమైన తీర్పు (WP No. 12889/2025) ఇచ్చింది. అక్రమ నిర్మాణం జరుగుతున్నప్పుడు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా, జీహెచ్‌ఎంసీ చట్టం సెక్షన్ 461-A ప్రకారం తక్షణమే ఆ భవనాన్ని లేదా నిర్మాణాన్ని సీజ్ చేయాలని అందులో స్పష్టం చేసింది. సీజ్ చేయకపోతే అధికారులు నోటీసుల పేరుతో కాలయాపన చేసేలోపు, సదరు యజమాని నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కానీ, కోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే సీజ్ చేయాల్సింది పోయి, రొటీన్ గా షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వడం, అటుపై 'హియరింగ్' అంటూ ఫైలును సాగదీయడం జీడిమెట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పరిపాటిగా మారిందంటూ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
వైన్ షాపు వ్యవహారంలో సాగదీత..?
వెన్నెలగడ్డలోని ఎల్.జి సుచిత్ర క్లాసిక్ అపార్ట్‌మెంట్స్ పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా వెలసిన 'శ్రీ అరుణాచలం వైన్స్' రేకుల షెడ్ వ్యవహారంలో అధికారుల సాగదీత స్పష్టంగా కనిపిస్తోందని ఫిర్యాదుదారులు విమర్శిస్తున్నారు. మార్చి 16, 2026న నివాసితుల ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణంగా గుర్తించిన అధికారులు అదే రోజు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 06, 2026న స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తూ, 15 రోజుల్లోగా షెడ్డును కూల్చివేయాలని యజమానికి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ గడువు ముగిసినా కూల్చివేత చర్యలు తీసుకోకుండా, మే 21, 2026న ఇరువర్గాలకు 'హియరింగ్ ఇంటిమేషన్' జారీ చేసి, మే 25న డీసీ ఛాంబర్ లో విచారణ జరిపారు. ఆపై దాదాపుగా 50 రోజుల అనంతరం జులై 09, 2026న ఫైనల్ ఆర్డర్ ఇస్తూ.. కూల్చివేతకు మళ్లీ 15 రోజుల గడువు ఇవ్వడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం మొదటి రోజే సీజ్ చేయాల్సిన వ్యవహారాన్ని నెలల తరబడి సాగదీస్తూ పదే పదే గడువులు ఇవ్వడం ఏమిటని వారు ఆరోపిస్తున్నారు.
అంతా 'హియరింగ్' మాయేనా?..
ఈ ఒక్క వైన్ షాపు వ్యవహారంలోనే కాదు, జీడిమెట్ల పరిధిలో డీసీ వ్యవహార శైలి అంతటా ఇలాగే ఉందన్న విమర్శలు స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. ఏకంగా డీసీ సర్కిల్ కార్యాలయం వెనుకనే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఓ భారీ కన్వెన్షన్ నిర్మాణం యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులకు కనిపించకపోవడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, బ్యాంకు కాలనీలో గతంలో సీజ్ అయిన ఓ భవనం.. ఏకంగా నిర్మాణం పూర్తి చేసుకుని, అందులో ఒక ప్రైవేట్ ఆసుపత్రి కూడా ప్రారంభం కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందనే విమర్శలు ఉన్నాయి. "బహుశా ఈ కన్వెన్షన్ సెంటర్, ఆసుపత్రి ఫైళ్లు కూడా డీసీ గారి వద్ద ఇంకా 'హియరింగ్' దశలోనే ఉన్నాయేమో!" అంటూ స్థానికులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతి అక్రమ నిర్మాణానికీ ఇదే తరహాలో విచారణల పేరుతో కాలయాపన చేసి నిర్ణయాలు తీసుకుంటారా అని స్థానిక వాసులు ప్రశ్నిస్తున్నారు.






