హస్మత్‌పేట బాధితులకు న్యాయం చేయాలి: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

by Kodari Anjali |

ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడంపై ఎంపీ ఈటల తీవ్రంగా మండిపడ్డారు.

హస్మత్‌పేట బాధితులకు న్యాయం చేయాలి: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
X

దిశ,మేడ్చల్: ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని, ఇది పూర్తిగా అన్యాయమని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. బాలానగర్ మండలం హస్మత్‌పేటలో హైడ్రా చేపట్టిన కూల్చివేతల బాధితులు శనివారం ఆయన నివాసానికి వెళ్లి తమ గోడును వినిపించారు. బాధితులను పరామర్శించేందుకు ఈటల రాజేందర్ తన నివాసం నుంచి హస్మత్‌పేటకు బయలుదేరగా, మేడ్చల్ పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితులు ఆయన నివాసానికే చేరుకుని తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను కాపాడడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ దశాబ్దాలుగా నివసిస్తూ విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, ఇతర ప్రభుత్వ ధ్రువపత్రాలు పొందిన పేదలపై ఇలా దాడి చేయడం అమానుషమన్నారు.

తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్..

అసలు భూములు విక్రయించిన బ్రోకర్లు, భూ మాఫియాపై చర్యలు తీసుకోకుండా, బలహీనులైన పేదలను లక్ష్యంగా చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హస్మత్‌పేటలో ఆర్కియాలజీ శాఖ భూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి పేదలను మోసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, వారి నుంచి బాధితులకు వడ్డీతో సహా డబ్బులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్, నోటరీ ఆధారంగా స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్న నిరుపేదలను రోడ్డున పడేయడం క్షమించరాని తప్పు అని, వారూ కట్టుకున్న ఇళ్లను డబుల్ బెడ్‌రూమ్ కింద కేటాయించి, వారి నివాసాలను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. భూ అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హస్మత్‌పేట బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఈటల రాజేందర్ గట్టిగా డిమాండ్ చేశారు.

Next Story