‘పుర’పోరుపై ప్రధాన పార్టీల ఫోకస్..! ఈటల, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్‌లకు సవాల్‌

by Ramesh Naini |

‘పుర’ పోరును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని స్కెచ్ వేస్తున్నాయి. ఇందులో భాగంగా అత్యధిక కౌన్సిలర్లను గెలిపించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి.

‘పుర’పోరుపై ప్రధాన పార్టీల ఫోకస్..! ఈటల, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్‌లకు సవాల్‌
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ‘పుర’ పోరును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని స్కెచ్ వేస్తున్నాయి. ఇందులో భాగంగా అత్యధిక కౌన్సిలర్లను గెలిపించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. మరీ ముఖ్యంగా తమ పట్టును నిలుపుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ తోటకూర వజ్రేష్ యాదవ్ సవాలుగా స్వీకరిస్తున్నారు. కాగా జిల్లాలో ఎల్లంపేట, ఆలియాబాద్, మూడు చింతలపల్లి మూడు మున్సిపాలిటీల్లో 68 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ అయింది. పోలింగ్ సెంటర్ల లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత వార్డుల రిజర్వేషన్ చేపడతారు. సంక్రాంతి తర్వాత షెడ్యూల్ రిలీజ్ కోసం ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. పార్టీలు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల గుర్తుల మీద ఈ ఎన్నికలు జరుగుతాయి. పురపాలికల్లో ఏ పార్టీ పొజిషన్ ఏంటో స్పష్టమవుతోంది.

జోష్‌లో అధికార పార్టీ..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్ అదే ఊపుతో మున్సిపాలిటీలనూ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో మూడు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ హైకమాండ్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు హరి వర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్, మార్కెట్ చైర్మన్ నరసింహులు యాదవ్‌లతో పాటు మండల స్థాయి నేతలను రంగంలోకి దింపింది. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని, అలాంటి వారినే తమ అభ్యర్థులుగా నిలిపి గెలిపించుకోవాలని హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్య నేతలు రంగంలోకి దిగి, మున్సిపాలిటీల వారీగా ఆశావహులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వార్డుల వారీగా జాబితాలను రెడీ చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్ల బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, మహిళా సంఘాలకు వ్యాపారాలు, విరివిగా రుణాలు, వడ్డీ చెల్లింపు తదితర సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లి ఓట్లు అడిగేందుకు సిద్దమవుతున్నారు.

పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. అయినా జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారు. దీనికి తోడు మెజారిటీ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇంకా బీఆర్ఎస్‌లోనే ఇప్పటికి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వస్తున్న మున్సిపాలిటీ ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని గుర్తించిన హైకమాండ్ మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా ఉండాలంటే వార్డుల్లో అత్యధికంగా కౌన్సిలర్లు మనవాళ్లే ఉండాలని కార్యకర్తలకు సూచనలిస్తున్నారని తెలిసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలని పిలుపునిస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించాలని, ప్రధానంగా స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టాలని, తమను కౌన్సిలర్లుగా గెలిపిస్తే వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామనే భరోసా కల్పించాలంటూ మల్లారెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈ ఎన్నికలపై అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పట్టు కోసం బీజేపీ ఫోకస్..

గ్రామీణం కాదు.. పట్టణమే తమ బలమని చెప్పుకునే కమలం పార్టీకి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంపై కన్నేసిన బీజేపీ ఇందుకు శివారు మున్సిపాలిటీల గెలుపును ఆసరా చేసుకోవాలని భావిస్తోంది. పార్టీ తన ఉనికిని చాటుకోవాలంటే మూడు మున్సిపాలిటీల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవాలి అనే మాట వినిపిస్తోంది. దీంతో సిట్టింగ్ ఎంపీ ఈటల రాజేందర్‌కు ఈ మున్సిపల్ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఘన విజయం సాధించినప్పటికీ, గత మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో మాత్రం పెద్దగా గెలిచింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పార్టీ రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీల వారిగా అభ్యర్థుల ఎంపిక, సమన్వయం కోసం టీమ్‌లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే స్థానిక నాయకత్వంలో మాత్రం సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ రూరల్ జిల్లా ప్రెసిడెంట్ బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి మధ్యన సఖ్యత లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంపీ ఈటల రాజేందర్‌కు పార్టీ నేతలను సమన్వయం చేయడంతో పాటు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. అయితే కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులకు ఈ ఎన్నికలు మాత్రం పరీక్షే. మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ పురపాలక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మూడు మున్సిపాలిటీల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

Next Story