కూకట్‌పల్లిలో ఇనాం భూమిపై ఇంద్రజాలం

by Malleboina Mahesh |

కూకట్‌పల్లిలో 11 ఎకరాల దళితుల ఇనాం భూమి అక్రమ ఆక్రమణ.. భవనాలున్నా రికార్డుల్లో సాగు భూమిగా చూపిస్తూ ధరణిలో మాయాజాలం!

కూకట్‌పల్లిలో ఇనాం భూమిపై ఇంద్రజాలం
X

దిశ, మేడ్చల్ బ్యూరో: అధికార బలం.. అగ్రవర్ణాల పలుకుబడి ఎదుట ఆ దళిత కుటుంబం మూడు తరాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. తాత నాటి ఇనాం పట్టా భూమిని అక్రమంగా లాగేసుకున్నారని కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. రెవెన్యూ అధికారుల ఇంద్రజాలంతో రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవడంతో, దశాబ్దాలుగా సాగు చేసుకున్న దళితుల భూమి పరాయి పాలైంది. కూకట్‌పల్లి మండల పరిధిలోని సర్వే నెంబర్ 90లో గల 11 ఎకరాల ఇనాం భూమిని కాపాడుకునేందుకు బాధితులు చేస్తున్న పోరాటం అసాధారణమైనది.

తరతరాల పోరాటం

రెవెన్యూ పాత రికార్డుల ప్రకారం.. కూకట్‌పల్లి సర్వే నెంబర్ 90 (Sy.No. 90/AA) లోని మొత్తం 15 ఎకరాల 15 గుంటల భూమిలో 11 ఎకరాల ఇనాం పట్టా భూమి (ఖుష్కి) పుర్రా పాపయ్య (తండ్రి పోచయ్య) వారసులకు చెందినది. 1959-60 నుంచి 1990 వరకు పహాణీలలో పుర్రా పాపయ్య పేరే పట్టాదారుగా, అనుభవదారుగా నమోదై ఉంది. 1960లో పాపయ్య మరణానంతరం ఆయన ఏకైక కుమార్తె చంద్రమ్మ, ఆ తర్వాత ఆమె కుమారులైన పుర్రా బాల్ రాజ్, పుర్రా స్వామి, పుర్రా బాబయ్యలు ఈ భూమిపై హక్కులు కలిగి ఉన్నారు. అయితే, అగ్రవర్ణానికి చెందిన కుటుంబం 1952 నాటి పాత కలెక్టర్ ప్రొసీడింగ్స్ చూపిస్తూ, ఈ భూమి తమదేనని దౌర్జన్యంగా ఆక్రమించుకుందని బాధితులు మొరపెట్టుకుంటున్నారు.

1999 నుంచి నేటి వరకు..

ఈ దళిత కుటుంబం న్యాయం కోసం పాలకుల నుంచి అధికారుల వరకు అన్ని కార్యాలయాల తలుపులూ తట్టింది. భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్ ఇప్పించి, తమ స్థలాన్ని స్వాధీనం చేయాలని కోరుతూ బాధితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే, అనగా 25 అక్టోబర్ 1999 నాడే అప్పటి ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నపాలు సమర్పించారు. ఆ పోరాటం అక్కడితో ఆగలేదు.. మళ్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు అందజేసి తమ ఆవేదనను వ్యక్తపరిచారు.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు, బాలానగర్ కూకట్ పల్లి తహశీల్దార్లకు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయానికి దశాబ్దాలుగా పదుల సంఖ్యలో అర్జీలు పెట్టుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా రికార్డులను సేకరించేందుకు నిరంతరం శ్రమించారు. కానీ కొన్ని సమయాలలో పూర్తిస్థాయిలో సమాచారం కూడా వీరికి లభ్యం కాలేదు అని చెప్తున్నారు.

అధికారలు మాయాజాలం

ఈ భూవివాదంలో అత్యంత విస్మయ కరమైన అంశం రెవెన్యూ అధికారుల మాయాజాలం. సదరు సర్వే నెంబర్ పరిధిలోని స్థలంలో ప్లాట్లు వెలిశాయి, ఇండ్లు వచ్చాయి, చివరకు బహుళ అంతస్తుల విద్యాసంస్థల భవనాలు కూడా వెలిశాయి. నిబంధనల ప్రకారం ఇది నాన్-అగ్రికల్చర్ భూమిగా మారాలి. కానీ, 17 జూన్ 2023న ధరణి పోర్టల్‌లో అధికారులు ఒక వింత ఇంద్రజాలానికి తెరలేపారు. అక్కడ భవనాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, రికార్డుల్లో మాత్రం అది ‘మెట్ట/సాగు భూమి’ అని చూపిస్తూ చౌదరి దామోదర్ రావు, చౌదరి జనార్ధన్ రావుల పేరిట తలా 5.0500 ఎకరాల చొప్పున అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆశ్రయం

తమ భూమిని కాపాడుకునేందుకు, సదరు స్థలంలో కోర్టు వివాదం నడుస్తోందంటూ బోర్డు పాతినందుకు పుర్రా స్వామి కుటుంబంపై ప్రత్యర్థులు కులం పేరుతో దూషిస్తూ తీవ్ర దౌర్జన్యానికి దిగారు. స్థానిక పోలీసు యంత్రాంగం కూడా తమపైనే కేసులు పెట్టి వేధిస్తోందని బాధితులు వాపోయారు. చివరకు రక్షణ కరువై, న్యాయం కోసం బాధితుడు పుర్రా స్వామి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా.. కమిషన్ దీనిని 'RC No. TSC/53/1743/HYD/2023' గా కేసు నమోదు చేసి సీరియస్ విచారణ చేపట్టింది. మండల, జిల్లా స్థాయిల నుంచి రాష్ట్ర రాజధానిలోని అత్యున్నత కార్యాలయాల వరకు దళిత కుటుంబం ఇన్నేళ్లుగా చేసిన ఈ పోరాటం ఎటువైపు దారితీస్తుందో, ఈ మూడు తరాల సుదీర్ఘ వేదనకు ఎప్పుడు ముగింపు లభిస్తుందోనని ఆ దళిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

Next Story