ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం.. ఇక్కట్లు పడుతున్న ప్రజలు

by Yella Dhawani Reddy |

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా సామాన్య ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం.. ఇక్కట్లు పడుతున్న ప్రజలు
X

దిశ, ఘట్కేసర్: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా సామాన్య ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఓవైపు రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమి అని వివరాలు చూపిస్తుండగా, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నిషేధిత జాబితాలో ఆ వివరాలు లేకపోవడం గమనార్హం. దీంతో కొందరు రియల్టర్లు ప్రభుత్వ రికార్డుల్లో తప్పులను తమకు అనుకూలంగా మలుచుకొని రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములు కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో 20 ఏళ్ల క్రితం ప్రైమ్ ల్యాండ్ వెంచర్స్ ప్రాజెక్ట్ చేసిన హుడా లేఅవుట్‌లో సీలింగ్ భూమి ఉందని ఇటీవల ఘట్కేసర్ తహశీల్ధార్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

హుడా లేఔట్‌లో ప్లాట్లకు నోటీసులు..

ఘట్కేసర్ పట్టణంలో సుమారు 20 ఏళ్ల క్రితం ప్రైమ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ సంస్థ చేసిన హుడా లేఅవుట్‌లో ప్రభుత్వ భూమి ఉందని, ఆ లేఔట్‌లోని ప్లాట్ల యజమానులకు ఇటీవల ఘట్కేసర్ తహశీల్ధార్ పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత అప్పటి తహశీల్ధార్ ఇచ్చిన సర్వే స్కెచ్ ఆధారంగా హుడా ఫైనల్ లేవట్ అప్రూవల్ చేసింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్లాట్లు సీలింగ్ భూమిలో ఉన్నాయని తహశీల్ధార్ 24 ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సర్వే నంబర్ 127లో 1.39 ఎకరాల భూమి భూ భారతి వెబ్‌సైట్లో సీలింగ్ భూమిగా చూపిస్తుండగా.. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్లో సర్వే నంబర్ 127 నిషేధ జాబితాలో లేకపోవడం గమనార్హం. దీంతో సర్వే నంబర్ 127లో ప్లాట్లు రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. రెండు ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లో సర్వే నంబర్ 127 వివరాలు వేర్వేరుగా చూపిస్తుండటం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోంది.

అధికారుల తప్పిదాలే సమస్యకు కారణం..

ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 127 పి, 128, 136 పి, 137 పి, 139పి, 145పి, 154 పి, 155పిలో దాదాపు 40 ఎకరాల్లో 2004 సంవత్సరంలో ప్రైమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధి లింగారెడ్డి మరికొందరు భాగస్వాములతో హుడా వెంచర్ చేశారు. అయితే ఈ వెంచర్‌లో 127 సర్వే నంబర్‌లోని 1.39 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని లేఔట్‌లో కలిపి హుడా లేఅవుట్ అప్రూవల్ తెచ్చుకున్నట్లు సమాచారం. అయితే ఇదే 1.39 ఎకరాల భూమిని ప్రైమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధి లింగారెడ్డి తనకు అమ్మేశాడని ఘట్కేసర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల స్వాధీనం చేసుకున్నాడు. దీంతో అధికారులు చేసిన తప్పిదాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రెండు ప్రభుత్వ శాఖలు ఒకే భూమికి సంబంధించిన వివరాలను వేర్వేరుగా చూపించడంతో ఏది నిజం.. ఏది అబద్దం తెలియని అయోమయం పరిస్థితి నెలకొంది.

మాకు న్యాయం చేయాలి..

సీలింగ్ భూమి సర్వే విషయంలో ప్లాట్ల యజమాలకు వెంచర్ నిర్వాహకులకు, నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా సర్వే చేశామని రెవెన్యూ అధికారులు రిపోర్టులను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు హెచ్ఎండీఏ అప్రూవ్ చేసిన లేఅవుట్ కాపీ, ఇతర ధ్రువీకరణ పత్రాలు తెప్పించుకొని విచారణ జరిపి న్యాయం చేయాలని పీఓటీ నోటీసులు అందుకున్న ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ తప్పిదాలను సవరించుకునే విషయంలో మరో తప్పిదం జరగకుండా జాగ్రత్త పడతారా? లేక సమస్యను పూర్తిగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతారా వేచి చూడాల్సిందే.

Next Story