ఫాక్స్ సాగర్ చెరువులో అక్రమ నిర్మాణాలకు ఇరిగేషన్ సహకారం!

by Ajay Maddhiboyina |

చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో భారీ అపార్ట్‌మెంట్ నిర్మాణానికి గుడ్డిగా ఎన్‌ఓసీ జారీ చేసి అక్రమ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ సహకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫాక్స్ సాగర్ చెరువులో అక్రమ నిర్మాణాలకు ఇరిగేషన్ సహకారం!
X

దిశ, మేడ్చల్ బ్యూరో : చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో భారీ అపార్ట్‌మెంట్ నిర్మాణానికి గుడ్డిగా ఎన్‌ఓసీ జారీ చేసి అక్రమ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ సహకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కన ఉన్నది చెరువా..? లేదా నాలా..? అన్న విషయాన్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా, ఎవరో తయారుచేసిన రిపోర్టుకు అనుకూలంగా ఎన్ఓసీ జారీ చేసేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం కొంపల్లి మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 151, 179 భూములలో కొద్దిపాటి విస్తీర్ణంలో ఉన్న ఫాక్స్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు చామకూర భద్రారెడ్డి నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ నిర్మాణం విషయంలో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఎన్‌వోసీ తప్పుగా ఇచ్చారనే విషయం ఆ ఎన్‌వోసీని చూస్తే అర్థమవుతుంది.

30 మీటర్ల బఫర్ జోన్.. 9 మీటర్లకు..

రికార్డుల ప్రకారం జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు 462 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్నది. మూడు గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ చెరువు కొంపల్లి మున్సిపాలిటీ, కొంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని వివిధ సర్వే నెంబర్లతో పాటు 151, 179లలో సైతం కొంతమేర వస్తుంది. ఈ విషయాన్ని 2014లో నిర్వహించిన సర్వే ఆఫ్ లేక్స్ ప్రాజెక్టులో భాగంగా నిర్ధారించారు. ప్రస్తుతం హెచ్ఎండీఏలో కూడా ఇదే రికార్డు ఉన్నది. దీని ప్రకారం ప్రస్తుతం చెరువులో నిర్మిస్తున్న శ్రీశిరిడి సాయి బిల్డర్స్ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతున్నది. చెరువు కోఆర్డినేన్స్ 61 నుంచి 64లను పరిశీలిస్తే ఈ విషయాన్ని ధృవీకరించుకోవచ్చు. ఇవిఏవి పరిగణలోకి తీసుకోకుండా 2021లో అప్పటి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి మరి అప్పటి మంత్రి మల్లారెడ్డి కొడుకు చామకూర భద్రారెడ్డి నిర్మిస్తున్న భవనానికి గుడ్డిగా ఎన్‌వోసీ జారీ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో 30 మీటర్లు ఉండాల్సిన చెరువు బఫర్ జోన్ కాస్త కేవలం 9 మీటర్లగా మారిపోయింది. దీని ప్రకారమే బఫర్ జోన్ మార్కింగ్ చేసి ఎన్ఓసీ ఇచ్చేశారని చెబుతున్నారు.

అధికారాన్ని అడ్డంపెట్టుకుని..

2014లోనే ఫాక్స్ సాగర్ చెరువు హద్దులను నిర్ణయించినప్పటికీ తప్పుడుగా ఇంకొక చెరువు సర్‌ప్లస్ నాలాగా చూపిస్తూ ఎన్‌వోసీ తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. కేవలం 2021లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పుడు మార్గాల ద్వారా ఎన్‌వోసీ తీసుకున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్ఓసీలు జారీ చేసే సమయంలో నివేదికను భూ యజమాని అయిన భద్రారెడ్డి పర్యవేక్షణలో జరిగిందా..? లేదా ముడుపులకు ఆశపడి అప్పటి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ జారీ అయ్యేటట్లుగా సహకరించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఏవిధంగా తప్పుడుగా నివేదికల రూపొందించారు..? చెరువును ఏవిధంగా నాలాగా చూపించారు..? అనే విషయాలు మరొక కథనంలో ‘దిశ’ బయటపెట్టనున్నది.

Next Story