- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉన్న ఇల్లు పోయింది.. కొత్త ఇల్లు దిక్కులేదు
రు పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, మేడ్చల్ బ్యూరో : నిరు పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. కొంత మంది అధికారులు చేస్తున్న పొరపాట్ల వల్ల ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ అబాసు పాలవుతోంది.తాజాగా మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో ఇదే జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఉన్న పాత ఇంటిని ఓ ఒంటరి మహిళ కూల్చివేసింది.కొత్త ఇంటికి ముగ్గు పోయమని మున్సిపల్ అధికారులను కొరితే.. మీ సర్వే నెంబర్ లో భవన నిర్మాణాలకు నిషేధం ఉందని చెప్పడంతో బాధిత ఒంటరి మహిళ లబోదిబో మంటుంది. ఇందిరమ్మ ఇంటి కోసం ఉన్న పాత ఇల్లు ను కూల్చుకుంటే ....రోడ్డున పడాల్సి వచ్చిందని తనకు న్యాయం చేయాలని స్థానిక మున్సిపల్ అధికారులతో పాటు,కలెక్టర్ ను సదరు మహిళ వేడుకుంటోంది.
వివరాలు ఇలా..
మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ మండలం,పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెములకు చెందిన హేమలత ఒంటరి మహిళ.గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్లు 739/పీ,740/పీ,741/పీ,742/పీ లలో ఏకశిలానగరం పేరిట వేసిన వెంచర్ లో ప్లాట్ నెంబర్ 546లోని 50 గజాల ఎక్సెంట్ స్థలాన్ని (లింకు డాక్యుమెంట్ నెంబర్ 19509/2005 అప్ ఎస్ఆర్వో1517) కొనుగోలు చేశారు. నారాపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2014,డిసెంబర్ 8వ తేదీన (డాక్యుమెంట్ నెంబర్ 4231/2014)తో రిజిస్ట్రేషన్ చేయించారు.సొంత ఇంటిని నిర్మించుకునేందుకు హేమలతకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో గత పదేళ్లుగా యాభై గజాల స్థలంలో రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు.ఆ ఇంటికి ఇంటి నెంబర్ తో సహా, కరెంట్, గ్యాస్ బిల్లులు, ఆధార్ కార్డులుసైతం అదే అడ్రస్ లో ఉన్నాయి. అయితే ఆ రేకుల షెడ్డు గోడ ఇటీవల కుంగిపోయింది. దీనికి తోడు కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా కొత్త ఇంటిని నిర్మించుకోవాలనుకుంది. ఇందులో భాగంగానే ఇంటి నిర్మాణం కోసం హేమలత దరఖాస్తు పెట్టుకోగా 2025,మే 22న అప్పటి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఇందిరమ్మ ఇంటి గృహ నిర్మాణ మంజూరు (1127/మేడ్చల్/ఇందిరమ్మ ఇండ్లు/2025) పత్రాన్ని అందజేశారు. దీంతో హేమలత శిథిలావస్థలో ఉన్న తన రేకుల ఇంటిని కూల్చి వేసుకుంది. ముగ్గు పోయాలని స్థానిక మున్సిపల్ అధికారులను హేమలత కోరగా, ఈ సర్వే నెంబర్లు ఇంటి నిర్మాణాలకు నిషేధం ఉన్నట్లు 2025,ఫిబ్రవరి 13 వ తేదీన సర్క్యులర్ వచ్చిందని అధికారులు అలస్యంగా సెలవిచ్చారు. దీంతో హేమలత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్క్యూలర్ ఉన్నప్పుడు.. మంజూరు ఎలా...
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యిందని, ముగ్గు పోయమని అడిగితే ఏకశిలా నగర్ సర్వే నెంబర్లు 739 నుంచి 742 వరకు ఇంటి నిర్మాణ నిషేధిత జాబితాలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారని బాధిత మహిళ హేమలత వాపోతున్నారు. ఇదే విషయమై మంగళవారం మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తాను తన కార్యాలయంలో కలిసి విన్నవించగా, అందుకు అదనపు కలెక్టర్ సర్క్యూలర్ ఉందని తెలియక ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసినట్లు చెప్పిందన్నారు. ఆయా సర్వే నెంబర్లలో ఇండ్లను నిర్మించరాదని ఫిబ్రవరిలోనే సర్క్యూలర్ వస్తే.. మే 22వ తేదీన తనకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం ఎలా ఇచ్చారని బాధిత ఒంటరి మహిళ హేమలత ప్రశ్నిస్తోంది. భవన నిర్మాణాల నిషేధం పై సర్క్యూలర్ ఉన్నందున ఇల్లు మంజూరు కాదని చెబితే..ఉన్న పాత ఇంటిని కూల్చుకునే దానిని కాదని వాపోతుంది. అధికారుల తప్పిదం వల్లనే తాను ఉన్న ఇంటిని కూల్చుకొని , రోడ్డున పడ్డానని, అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని, అధికారులే తనకు న్యాయం చేసి కొత్త ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని హేమలత వేడుకుంటుంది.






