బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు...!

by Kodari Anjali |

మున్సిపల్ అధికారుల లంచగొండితనం, నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు...!
X

దిశ, ఘట్కేసర్: మున్సిపల్ అధికారుల లంచగొండితనం, నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని బఫర్ జోన్ లో భారీ ఎత్తున కొనసాగుతున్న అక్రమ నిర్మాణం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేసి అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట, నారపల్లిలో అక్రమ నిర్మాణాలను సీజ్ చేసిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణం

ఘట్కేసర్ డివిజన్ శివారెడ్డిగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎదులాబాద్ డివిజన్ మర్పల్లిగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 24, 25 లో దాదాపు రెండు ఎకరాల భూమిలో భారీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిసింది. అనాథ ఆశ్రమం కోసం ఈ నిర్మాణం చేపడుతున్నామని, దీనికి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి అవసరం లేదని చెబుతుండటం గమనార్హం. ఘట్కేసర్ సర్కిల్ పట్టణ ప్రణాళిక అధికారులు తూతూ మంత్రంగా మౌఖికంగా హెచ్చరికలు చేస్తున్నారే తప్ప అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడం లేదు. బేస్మెంట్ స్థాయిలో నిర్మాణం ఉండగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఎంఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తాం.. మెరుగు నరేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు

అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు, ఘట్కేసర్ మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులే ప్రోత్సహిస్తుండం విచారకరం. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే అవినీతి అధికారులపై మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తాం.

Next Story