చెట్టేరు కుంటలో అక్రమ నిర్మాణం.. అడిగేవారే లేరా..?

by Nagam Mallesh |
చెట్టేరు కుంటలో అక్రమ నిర్మాణం.. అడిగేవారే లేరా..?
X

దిశ, ఘట్కేసర్ః చెరువులు, కుంటల పరిరక్షణ విషయంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పలు విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఘట్కేషర్ పరిసరాల్లో కుంటలు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో సర్వే నెంబర్ 257, 293లో 12 ఎకరాల విస్తీర్ణంలో చెట్టేరు కుంట ఉంది. చెట్టేరు కుంట బఫర్ జోన్ లో దాదాపు 2వేల గజాలలో అక్రమ నిర్మాణాలపై స్థానిక వార్డ్ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ మున్సిపల్ కమిషనర్ కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. నాలుగు నెలల క్రితమే కుంట ఎఫ్ టి ఎల్ , బఫర్ జోన్ హద్దులు ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి రిపోర్టులు మున్సిపల్ అధికారులకు అప్పగించారు. చెట్టేరు కుంట చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలంటే మున్సిపల్ ఖజానాలో నిధులు లేవని అప్పట్లో అధికారులు చేతులెత్తేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు చెట్టేరు కుంట బఫర్ జోన్ లో పార్కు, రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. చిట్టేరుకుంట పక్కనే వెంచర్ చేస్తున్న రియల్టర్లు చెరువును చూపించకుండానే హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తెచ్చుకున్నారని, రియల్టర్లతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి.

రెండేళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా..

వార్డ్ కౌన్సిలర్ మల్లేష్

చెట్టేరుకుంట కబ్జా విషయంలో రెండేళ్లుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా. నాలుగు నెలల క్రితం ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్వర్ చెట్టెరుకుంట ఎఫ్టిఎల్ తో పాటు బఫరు జోన్ గుర్తించి మున్సిపల్ కమిషనర్ కు రిపోర్టులు ఇచ్చారు. ఇప్పటివరకు కుంట పరిరక్షణకు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుంట పక్కన వెంచర్ చేస్తున్న వారు బఫర్ జోన్ లో పార్కు, రోడ్డు నిర్మించారు. కుంటలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం. జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు.

చెరువులు , కుంటల పరిరక్షణ ఇక హైడ్రా పరిధిలో..

మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ

చెరువులు, కుంటల పరిరక్షణ ఇప్పుడు హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) పరిధిలోకి వెళ్లిపోయింది. ఎవరైనా కుంటలు, చెరువులు కబ్జా చేసిన ఊరుకునే ప్రసక్తే లేదని కమిషనర్ సాబీర్ అలీ తెలిపారు. హైడ్రా అధికారులతో జిల్లా కలెక్టర్ సమక్షంలో సమావేశం కూడా జరిగిందని.. ఒక చెట్టేరు కుంటే కాదు ఘట్కేసర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఉన్న అన్ని చెరువులు, కుంటల పరిరక్షణకు పగడ్బందీ చర్యలు చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.



Next Story

Most Viewed