- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందల ఎకరాలు కబ్జా అవుతున్నా..!
వందల ఎకరాల భూములు కబ్జా అవుతున్నా.. జర్నలిస్టులకు వంద గజాల స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : వందల ఎకరాల భూములు కబ్జా అవుతున్నా.. జర్నలిస్టులకు వంద గజాల స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బుధవారం మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటు చేసిన నూతన జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా ఆర్టీఏ సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి, బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రెస్ క్లబ్ పని చేయాలని అకాంక్షించారు. ఎన్నో సమస్యలతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం చొరవ చూపడంలేదన్నారు. జిల్లా ప్రెస్ క్లబ్ కు సొంతస్థలాన్ని కేటాయించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. నూతన జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
మీడియా ప్రజల గొంతుక : వైఎస్సార్
మీడియా సమాజంలో అత్యంతకీలకమైన పాత్ర పోశీస్తుందని బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ చార్జీ, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కు ఎదురుగా జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. పత్రికా విలేకర్ల ప్రజల కోసం పని చేసే వారని కిరాయి భవనంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం విచారకరమన్నారు. జిల్లా ప్రెస్ క్లబ్ కోసం స్థలాన్ని కేటాయిస్తే, నిర్మాణానికి తగిన సహాయం అందిస్తామన్నారు. పత్రికా విలేకర్లు ప్రజల కోసం తమ సేవలను కొనసాగించాలని సుదర్శన్ రెడ్డి కోరారు. పత్రిక, మీడియా ప్రజలకు ప్రతినిత్యం నిజానిజాలు తెలియజేస్తూ, సమాజాన్ని న్యాయం వైపు నడిపించే శక్తిగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రజా స్వామ్యంలో మీడియా నాలుగో స్థంభంగా నిలిచి, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే వంతెనగా పనిచేస్తాయని తెలిపారు.
ప్రెస్ క్లబ్ స్థలం కోసం కృషి చేస్తా : భీమిడి జైపాల్ రెడ్డి
జిల్లా ప్రెస్ క్లబ్ సొంత స్థలం కోసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానని జిల్లా ఆర్టీఏ సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికే జిల్లా ప్రెస్ క్లబ్ కోసం స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం జర్నలిస్టులను అన్ని విధాలుగా అదుకుంటుందన్నారు.
ప్రజలకు అందుబాటులో.. ప్రెస్ క్లబ్ నర్సింహులు యాదవ్
జిల్లా ప్రెస్ క్లబ్ ను ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేసినందుకు జిల్లా మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ నర్సింహులు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని ఇప్పించేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఇతర సంఘాలకు ఆదర్శం .. జి.వినోద్ కుమార్
ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఇతర సంఘాలకు ఆదర్శం, మార్గా నిర్దేశమని గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి.వినోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రెస్ క్లబ్ కమిటి సభ్యులకు శాలువాలు కప్పి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
స్వేచ్ఛను చాటుకున్నారు : రవి ప్రకాష్
ప్రెస్ క్లబ్ ను కలెక్టరేట్ బయట ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా విలేకర్లు మీడియాకు ఉన్న స్వేచ్ఛను కాపాడుకున్నారని మేడ్చల్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు బి. రవి ప్రకాశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాళోజీ కవితను గుర్తు చేస్తూ, వంద మాటలు మాట్లాడటం ఒక ఎత్తు అయితే ఒక కవిత రాయడం ఒక ఎత్తు అన్నారు. ఇక్కడ జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం పట్ల రవి కృతజ్ఞతలు తెలుపుతూ, వచ్చే నెల 5న టీ.ఎన్.జీ.ఓ నిర్వహించనున్న కార్యక్రమానికి మీడియా సహకరించాలని రవి ప్రకాశ్ కోరారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, యూనియన్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, టీ.యు.డబ్ల్యు.హెచ్. 143 జిల్లా అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ, రాబోయే రోజుల్లో ప్రెస్ క్లబ్ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, శామీర్ పేట మాజీ జెడ్పీటీసీ అనిత లాలయ్య, జిల్లా డీపీఆర్ఓ స్వర్ణలత, ఐ.అండ్ పీ.ఆర్ డిప్యూటీ ఇంజినీర్ నాగాంజలి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కల్లెపల్లి రవిచంద్ర, పాక రవీందర్, జిల్లా జర్నలిస్టులు దేశం క్రిష్ణ గౌడ్, పన్నాల బాల్ రెడ్డి, రవికిరణ్ రెడ్డి, తోకల మల్కయ్య, రామారావు, పండుగ రామక్రిష్ణ, రచ్చ శ్రీనివాస్, హన్మంతరెడ్డి, కె.ప్రసాద్, శామీర్ పేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు క్యాతంరవి, కోశాధికారి గిరి ప్రసాద్, సలహాదారులు వెంకట్ రెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు భూపాల్ పాల్గొన్నారు.






