హౌసింగ్​ బోర్డు భూములు వేలం ద్వారానే కేటాయిస్తాం: అధికారులు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-25 02:59:50  IST  )

కూకట్​పల్లి నియోజకవర్గంలో హౌసింగ్​ బోర్డు భూముల వేలం వివాదం రోజు రోజుకు ముదురుతోంది.

హౌసింగ్​ బోర్డు భూములు వేలం ద్వారానే కేటాయిస్తాం: అధికారులు
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి నియోజకవర్గంలో హౌసింగ్​ బోర్డు భూముల వేలం వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈనెల ఆఖరున, వచ్చే నెల హౌసింగ్​ బోర్డు శాఖ ఆధీనంలో ఉన్న కొన్ని భూములను వేలంలో విక్రయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే వాటిని వేలం వేయకుండా ప్రజా అవసరాలకు వినియోగించాలంటూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ, హౌసింగ్​ బోర్డు శాఖ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉండగా హౌసింగ్​ బోర్డు శాఖ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, హౌసింగ్​ బోర్డు శాఖ ఆధీనంలో ఉన్న భూములను గతంలో రైతుల నుంచి కొనుగోలు చేసిందని, వాటిని విక్రయించుకునే పూర్తి అధికారాలు ఆ సంస్థకు ఉంటాయని, వాటిని కాదని చెప్పే హక్కు ఎవరికి లేదని పాలక పక్ష నాయకులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి ఆమోదంతో ఏర్పాటు చేసిన హౌసింగ్​ బోర్డు శాఖకు చెందిన భూములను విక్రయించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఎవరికి లేదని, ఆ భూములను గృహ సముదాయాలు నిర్మించి విక్రయించాల్సిందేనని కోప్​ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకుడు శివ ప్రసాద్​ అంటున్నారు.

హౌసింగ్​ బోర్డు శాఖ

నిజాం పాలనలో 1911 ఏర్పడి సిటీ ఇమ్​ప్రూవ్​మెంట్​ బోర్డు, 1931లో ఏర్పడిన టౌన్​ ఇమ్​ప్రూవ్​మెంట్​ ట్రస్ట్​ ఆఫ్​ సికింద్రాబాద్‌లను కలిపి 1960లో ఆంధ్రప్రదేశ్​ హౌసింగ్​ బోర్డును స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఏర్పాటు చేశారు. అనంతరం 1967లో అప్పటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి ల్యాండ్​ బ్యాంక్​ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కూకట్​పల్లి పరిసర ప్రాంతాలలో రైతుల నుంచి ఎకరం రూ. 500-1000 ఇచ్చి సుమారు 1350 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. రైతుల నుంచి సేకరించిన 1350 ఎకరాల భూమిలో హౌసింగ్​ బోర్డు శాఖ ఎల్​ఐజీ, ఎంఐజీ, హెచ్​ఐజీల పేరుతో గృహ సముదాయాలను నిర్మించింది. ఇలా ఏర్పడిన కాలనీ కూకట్​పల్లి హౌసింగ్​ బోర్డు కాలనీ (కేపీహెచ్​బీ కాలనీ)గా పేరు గాంచింది. ఇందులో కేపీహెచ్​బీ కాలనీ ఫేజ్​ 1,2,3,4,5,6,7,9,10లలో హౌసింగ్​ బోర్డు శాఖ నిర్మించి పేద, మధ్య, ధనికులతో డీడీలు కట్టించుకుని విక్రయించింది. అలాగే ఫేజ్​ 8,11,12,13,14లలో బడా నిర్మాణ సంస్థలకు అప్పగించి జాయింట్​ వెంచర్​లను నిర్మించారు. మిగిలిన హౌసింగ్​ బోర్డు శాఖ ఆధీనంలో ఉన్న భూములను వేలం ద్వారా విక్రయిస్తూ వస్తోంది.

ఆలయాలకు, మసీదులకు కేటాయించలే..

హౌసింగ్​ బోర్డు శాఖ ఆధీనంలో ఉన్న భూములలో కేవలం మూడో ఫేజ్​లోని కనకదుర్గా ఆలయం, జేఎన్​టీయూ నుంచి హైటెక్​ సిటీకి వెళ్లే దారిలో అమ్మవారి ఆలయానికి 350 గజాల భూమిని తప్పా.. ఏ ఆలయానికి, మసీదుకు కూడా అధికారికంగా కేటాయించలేదని సమాచారం. ఇందులో 4వ ఫేజ్​, ఫోరం మాల్​ సమీపంలో మూడో ఫేజ్​లో, రమ్య గ్రౌండ్​ సమీపంలో ఇలా ప్రతి ఫేజ్​లో ఆలయాల పేరుతో భూమి కబ్జాకు గురైంది. అలాగే మూడో ఫేజ్​లో గత వారం రోజులుగా వివాదంలో ఉన్న వరసిద్ది వినాయక ఆలయం ఉన్న 630 గజాల స్థలం భూమిలో పదేండ్ల క్రితమే హౌసింగ్​ బోర్డు శాఖ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ఆలయం చిన్నదిగా నిర్మించారు. గత బీఆర్​ఎస్​ హయాంలో హౌసింగ్​ బోర్డు శాఖ అధికారులు కండ్లు మూసుకోవడంతో కొన్ని ఎకరాల భూమి ఇలా కబ్జాకు గురై కనుమరుగయ్యింది.

కబ్జాల వెనుక హౌసింగ్​ బోర్డు అధికారులు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత హౌసింగ్​ బోర్డు శాఖ ఆధీనంలో ఉన్న భూములు పెద్ద సంఖ్యలో కబ్జాలకు గురయ్యాయి. ఇందులో హౌసింగ్​ బోర్డు అధికారులు హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న అధికారి దశాబ్ద కాలంగా వెస్ట్రన్​ డివిజన్​లోనే పాతుకుపోయి, గత బీఆర్​ఎస్​ హయాంలో అప్పటి ప్రజా ప్రతినిధులకు అడుగులకు మడుగులు ఒత్తుతూ.. ఎక్కడ కబ్జా చేసిన పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్లు విలువ చేసే భూమిలో ఆలయాలు, మసీదులు, నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేసిన కింది స్థాయి నుంచి వీసీ వరకు పట్టించుకోకపోవడంతో స్వచ్చంద సంస్థ సభ్యులు కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. హౌసింగ్​ బోర్డు జాయింట్​ వెంచర్​లలో కొన్ని 6 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటు విజిలెన్స్​ విచారణలో తేలింది. ఈ విషయంలో ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెస్​ సంస్థ వ్యవస్థాప అధ్యక్షుడు, విశ్రాంత ఐఎఫ్​ఎస్​ అధికారి ఎం. పద్మనాభ రెడ్డి గవర్నర్​కు సైతం ఫిర్యాదు చేశారు.

విక్రయానికి పెట్టిన భూములు

తెలంగాణ హౌసింగ్​ బోర్డు శాఖ ఆధీనంలో కేపీహెచ్​బీకాలనీలో సర్వే నంబర్​ 1009లోని 4598 గజాలు, 2420 గజాలు రెండు కమర్షియల్​ భూములను హౌసింగ్​ బోర్డు శాఖ ఈ నెల 30వ తేదిన వేలం వేసేందుకు ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. గజం లక్షల రూపాయల నుంచి వేలం ప్రారంభించనున్నారు. అలాగే కేపీహెచ్​బీకాలనీ ఆర్​టీఏ కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని సైతం వచ్చే నెలలో విక్రయానికి ఉంచినట్టు సమాచారం.

భూములు అమ్మే అధికారం ప్రభుత్వాలకు లేదు..

రాష్ట్రపతి ఆమోదంతో ఏర్పడిన హౌసింగ్​ బోర్డు శాఖ అభివృద్ధి పేరుతో ఇప్పటికే రూ.వేల కోట్ల విలువ చేసే హౌసింగ్​ బోర్డు భూములను ప్రభుత్వం విక్రయించింది. నిజానికి హౌసింగ్​ బోర్డు ఆధీనంలో ఉన్న భూములను విక్రయించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేదు. హౌసింగ్​ బోర్డు శాఖ ముమ్మాటికి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. హౌసింగ్​ బోర్డు భూముల విషయంలో కోర్టులో పిల్ దాఖలు చేశాం.

- శివ ప్రసాద్​, కోప్​ సంస్థ, వ్యవస్థాపకుడు

భూములను కాజేసిన నేతలే గగ్గోలు పెడుతున్నారు

హౌసింగ్​ బోర్డు ఆధీనంలో ఉన్న భూములను విక్రియించే హక్కులు హౌసింగ్​ బోర్డు శాఖకే ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కావాలనే గగ్గోలు పెడుతున్నారు. గత పది ఏళ్ల కాలంలో హౌసింగ్​ బోర్డు శాఖకు చెందిన భూములు కబ్జా చేశారు. ఆలయాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారు. హౌసింగ్​ బోర్డు భూములను తమ ఆధీనంలో ఉంచుకుని కిరాయిలు వసూలు చేసింది బీఆర్​ఎస్​ నాయకులే. తప్పుడు ఆరోపణలు చేస్తు బీఆర్​ఎస్​ నాయకులు, ఎమ్మెల్యే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

- బండి రమేష్​, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్​ ఇన్​చార్జి కూకట్​పల్లి

Next Story