- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెరిగిన ‘మార్కెట్ విలువ..’ రియల్ ఎస్టేట్‌పై గొడ్డలివేటే
రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర మాంద్యం నెలకొని, విక్రయాలు పడిపోయిన ప్రస్తుత తరుణంలో భూముల మార్కెట్ విలువను పెంచడం ఆ రంగంపై గొడ్డలివేటు వేయడమేనని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, మేడ్చల్ బ్యూరో : రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర మాంద్యం నెలకొని, విక్రయాలు పడిపోయిన ప్రస్తుత తరుణంలో భూముల మార్కెట్ విలువను పెంచడం ఆ రంగంపై గొడ్డలివేటు వేయడమేనని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. మార్కెట్ విలువ పెంచిన నేపథ్యంలో, కొనుగోలుదారులపై భారం పడకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 3 శాతానికి తగ్గించాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
60 శాతం అదనపు భారం.. అవగాహన లేని మాటలు!
మార్కెట్ విలువ పెరగడం వల్ల కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జీలే కాకుండా ఎల్ఆర్‌ఎస్, భవన నిర్మాణ అనుమతుల ఛార్జీలు కూడా భారీగా పెరుగుతాయని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఉదాహరణకు.. గతంలో రూ.5 వేల మూడువందల మార్కెట్ విలువ ఉన్న చీనకచర్ల, పర్వతాపూర్, నారపల్లి వంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఏకంగా రూ.9 వేల మూడువందలకు పెంచారని, ఈ 60 శాతం పెంపు వల్ల సామాన్యులపై తీవ్ర భారం పడుతోందని ధ్వజమెత్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
‘ప్రొహిబిటెడ్’ తిప్పలు.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
కేవలం అసైన్డ్ భూములను మాత్రమే కాకుండా, అన్ని రకాల క్లియర్ టైటిల్ ఉన్న భూములను, ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల బాధితులు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లు, ఇళ్లు ప్రైవేటు సర్వే నంబర్లలోనే ఉన్నాయని అధికారులకు మొరపెట్టుకున్నా వినే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం అత్యవసరంగా ఆస్తులు అమ్ముకుందామనుకుంటే.. వాటిని ప్రభుత్వ భూములుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు.
ఒకరి పాపం.. అందరికీ శాపం!
రెవెన్యూ శాఖ పూర్తి వివరాలు లేకుండా రిజిస్ట్రేషన్ల శాఖకు జాబితాలు పంపడం వల్లే ఈ గందరగోళం నెలకొందని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఒక సర్వే నంబర్ పరిధిలోని 50 ఎకరాల్లో కేవలం ఒక ఎకరం మాత్రమే ప్రభుత్వ భూమి ఉంటే.. ఆ ఒక్క ఎకరం ఎక్కడుందో తెలియదనే నెపంతో మిగిలిన 49 ఎకరాల్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నారు. ఇది తీవ్ర అన్యాయం అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ తీవ్రమైన సమస్యపై రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలు తక్షణమే స్పందించి, సమన్వయంతో ఉమ్మడి పరిష్కారాన్ని చూపాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.






