Dundigal: స్టేడియం పరిసరాలు.. కంపు కంపు

by Ramesh Goud |

హెచ్ఎండీఎ, మున్సిపల్ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది.

Dundigal: స్టేడియం పరిసరాలు.. కంపు కంపు
X

దిశ, దుండిగల్ : హెచ్ఎండీఎ, మున్సిపల్ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో సెప్టిక్ ట్యాంక్ లేకపోవడంతో గండిమైసమ్మలోని జ్యోతిరావు పూలే స్టేడియం పరిసరాలు డ్రైనేజీతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దుండిగల్ మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 15 బ్లాకులుగా 1700 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పేదల కోసం నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని హెచ్ఎండీఎ అధికారులకు అప్పగించింది. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని నిర్మించిన హెచ్ఎండీఎ అధికారులు కనీస వసతులైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కనీస వసతులు కల్పించాల్సిన అధికారులు చేతులెత్తేయడం, సౌకర్యాల కల్పనలో మున్సిపల్ అధికారులు విఫలమవడంతో లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. డ్రైనేజీ పొంగిపొర్లుతూ స్టేడియం పరిసరాల్లో మురుగు ఏరులై పారుతూ దుర్వాసన వెదజల్లుతుండడంతో క్రీడాకారులు, స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

ప్రారంభానికి ఆరేండ్లు జాప్యం..

హెచ్ఎండీఎ అధికారులు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని నిర్మించడంతో పాటు కనీస వసతులు కల్పించాల్సి ఉంటుంది. నిధుల కొరత, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిర్మాణాలు పూర్తైనా సుమారు 6ఏండ్ల పాటు ప్రారంభానికి నోచుకోలేదు. 2018లో సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను హడావిడిగా ప్రారంభించి నిర్వహణ బాధ్యతను మున్సిపల్ అధికారులకు అప్పగించింది. కనీస వసతులు కల్పించకుండా హెచ్ఎండీఎ అధికారులు లబ్ధిదారులకు అప్పగించగా, మున్సిపల్ అధికారులు కల్పించలేక పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పొంగిపొర్లుతున్న డ్రైనేజీ..

డబుల్ బెడ్రూం ఇండ్లలోని 1700 ఫ్లాట్లలో సుమారు 900 ఇండ్లలో గృహ ప్రవేశాలు జరిగాయి. సెప్టిక్ ట్యాంక్ లేకపోవడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల నుంచి డ్రైనేజీ జ్యోతిరావు పూలే స్టేడియంలోకి ఏరులై పారుతుండడంతో పరిసర ప్రాంతాలు దుర్వాసన వెదజల్లుతూ ఆగమ్యగోచరంగా మారాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం నుంచి పైప్ లైన్ ద్వారా స్టేడియం వైపు డ్రైనేజీ వదలడంతోనే సమస్య తలెత్తినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోగాలబారిన పడుతున్న క్రీడాకారులు

గండి మైసమ్మలోని జ్యోతిరావు పూలే స్టేడియం ఇటీవల ఫ్రెండ్లి క్రికెట్, మెమోరియల్ క్రికెట్స్‌తో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. రహదారి పొడవునా చెట్లు అలుముకోవడంతో వాకింగ్ ట్రాక్ కు నిలయంగా మారింది. డ్రైనేజీ పొంగిపొర్లుతుండడంతో దోమలు, క్రిమి కీటకాల బారిన పాడుతూ క్రీడాకారులు, స్థానిక ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం.. మున్సిపల్ కమిషనర్

డబుల్ బెడ్రూం ఇండ్ల నుంచి ప్రవహిస్తున్న డ్రైనేజీపై దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరావును వివరణ కోరగా డ్రైనేజీ సమస్య మా దృష్టిలో ఉందన్నారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని రాబోయే సర్వసభ్య సమావేశంలో చర్చించి శాశ్వత పరిస్కారానికి కృషి చేస్తాం.

Next Story