ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారికే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

by Nallavelli.Anjaneyulu |

ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల‌లో మౌలిక వసతులు కల్పించి, అర్హులైన లబ్ధిదారులందరూ అక్కడ నివసించేలా చూడాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీ. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారికే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల‌లో మౌలిక వసతులు కల్పించి, అర్హులైన లబ్ధిదారులందరూ అక్కడ నివసించేలా చూడాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీ. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఇండ్లు కేటాయించినప్పటికీ ఇంకా కాలనీల్లోకి షిఫ్ట్ కాని వారందరికీ మరోసారి నోటీసులు జారీ చేయాలని, అయినా స్పందించకుంటే కేటాయింపులను రద్దు చేసి ఇతర అర్హులకు ఇస్తామని స్పష్టం చేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆయన బౌరంపేట, గండిమైసమ్మ, దుండిగల్ పరిధిలోని పలు 2 బీహెచ్‌కే కాలనీల్లో విస్తృతంగా పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారు.

ఇల్లొచ్చినా ఉండకపోతే రద్దు!

దుండిగల్ ఫేజ్-1 కాలనీని పరిశీలించిన వి.పి.గౌతమ్, అక్కడ ఇండ్లు పొంది కూడా చాలా మంది నివాసం ఉండటం లేదనే విషయాన్ని గుర్తించారు. వేల మంది పేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారని, ఇల్లు వచ్చినా ఉండటానికి ముందుకు రాని వారి కేటాయింపులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే, దుండిగల్ ఫేజ్-2 లో మిగిలి ఉన్న పనులను, మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

5 కిలోమీటర్ల పరిధి వారికే ప్రాధాన్యత

డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి సమీపంలోని 5 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికే ఆ ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఎండి గౌతమ్ తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ‘ఇంటి స్థలం - సొంత ఇల్లు లేని’ (L-2) జాబితాలో ఉండి, దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం తహశీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే జరుగుతోందని వివరించారు. గండిమైసమ్మ ప్రాంతంలో అధికారులు నిర్వహిస్తున్న ఈ సర్వే ప్రక్రియను కలెక్టర్‌తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే వివరాలను యాప్‌లో సమగ్రంగా అప్‌లోడ్ చేయాలని, సర్వే పూర్తయిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరికి సూచించారు. ఈ పర్యటనలో హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఎం.చైతన్యకుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయకుమార్, హౌసింగ్ బోర్డు సి.ఇ జి.వి.రమణారెడ్డి, జిల్లా హౌసింగ్ పిడి రమణమూర్తితో పాటు రెవెన్యూ, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story